ఆసియా కప్‌ హీరోలకు ఘన స్వాగతం.. లంక వీధుల్లో విక్టరీ పెరేడ్‌

13 Sep, 2022 14:49 IST|Sakshi

ఆసియా కప్‌-2022 విజేత శ్రీలంకకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఓ పక్క ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్నప్పటికీ ద్వీప దేశ ప్రజలు తమ హీరోలకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. తమను గర్వంగా తలెత్తుకనేలా చేసిన హీరోలకు బాధలన్నీ దిగమింగి సుస్వాగతం చెప్పారు. కొలొంబోలోని బండారు నాయకే ఎయిర్‌ పోర్టు నుంచి ఓ రేంజ్‌లో విక్టరీ పరేడ్‌ నిర్వహించారు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు, ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా.. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంక ఆటగాళ్లు డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో విజయ దరహాసం చిందిస్తూ ప్రజలకు ఆభివాదం చేస్తున్న దృశ్యాలను లంక క్రికెట్‌ బోర్డు ట్వీట్‌ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 

కాగా, ఏమాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్‌ బరిలోకి దిగిన శ్రీలంక.. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓడినప్పటికీ, ఆతర్వాత బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌, పాకిస్తాన్‌లపై వరుస విజయాలు సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అనంతరం తుది పోరులో పాక్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భానుక రాజపక్ష (71 నాటౌట్‌), హసరంగ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసిం‍ది. ఛేదనలో లంక బౌలర్లు ప్రమోద్‌ మధుశన్‌, హసరంగ, కరుణరత్నే చెలరేగడంతో పాక్‌ 147 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని చవిచూసింది. 

మరిన్ని వార్తలు