అదే అతిపెద్ద మైలురాయి.. అందుకే: హెడెన్‌

10 Dec, 2020 19:17 IST|Sakshi

సిడ్నీ: గత దశాబ్ద కాలంగా టీమిండియాను ప్రభావితం చేస్తున్న ఆటగాళ్ల గురించిన చర్చలో ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మూడు ఐసీసీ ట్రీఫీలను భారత్‌కు అందించి విజయవంతమైన కెప్టెన్‌గా ధోని ముద్ర వేస్తే.. కోహ్లి క్రీజులో ఉంటే చాలు గెలుపుపై నిశ్చింతగా ఉండొచ్చు అనేలా రన్‌మెషీన్‌ అనేకానేక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. వికెట్‌ కీపర్‌గా ఎవరికీ సాధ్యంకాని రికార్డులతో మిస్టర్‌ కూల్‌ ఖ్యాతికెక్కితే.. క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక బెస్ట్‌ క్రికెటర్‌గా వీరిద్దరిలో ఒకరికే ఓటు వేయాలంటే చాలా మంది ఎటూ తేల్చులేకపోతారు. అభిమానుల విషయం పక్కనపెడితే, క్రికెట్‌ ప్రేమికులు మాత్రం ఈ చర్చలో ఎటువైపు నిలబడాలో తెలియక సతమతమవుతారు. అయితే తాను మాత్రం ఇందుకు మినహాయింపు అంటున్నాడు ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌. (చదవండి: దుమ్మురేపిన కోహ్లి.. రెండో స్థానంలో రోహిత్‌)

భారత్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిపెట్టిన కెప్టెన్‌ కూల్‌ ధోనీనే తన దృష్టిలో గొప్ప ఆటగాడు అని స్పష్టం చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన హెడెన్‌.. ‘‘ఎంఎస్‌ ధోని ప్రపంచకప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ సాధించాడు. వరల్డ్‌ కప్‌ సాధించడం అనేది ఒక ఆటగాడి జీవితంలో అతి పెద్ద మైలురాయి. వన్డే ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడినా, ఈ మెగా టోర్నీ విషయానికొచ్చేసరికి ఏవిధంగా సన్నద్ధమయ్యామనేదే ముఖ్యం. ఆ సమయంలో కేవలం ఒక మంచి నాయకుడిగా ఉంటే మాత్రమే సరిపోదు. ధోనిలాగా మిడిలార్డర్‌లో స్ట్రాంగ్‌ బ్యాట్స్‌మెన్‌గా కూడా ఉండాలి’’ అని చెప్పుకొచ్చాడు.

నా దృష్టిలో అయితే కోహ్లినే
టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ మాత్రం కోహ్లికే ఓటు వేయడం గమనార్హం. గత దశాబ్ద కాలంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది అతడే అని తేల్చిచెప్పాడు. క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో వీరిద్దరు ఈ మేరకు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాగా ధోని సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వరల్డ్‌ కప్‌, టీ20 ప్రపంచ కప్‌‌, చాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక కోహ్లి సైతం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వంటి దిగ్గజాల రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతున్నాడు. ధోని నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. 

మరిన్ని వార్తలు