Viral Video: మాథ్యూ వేడ్‌ తొండాట.. క్యాచ్‌ పట్టబోయిన మార్క్‌ వుడ్‌ను తోసేసి..!

9 Oct, 2022 21:31 IST|Sakshi

AUS VS ENG 1st T20: 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లండ్‌ ఇవాళ (అక్టోబర్‌ 9) తొలి మ్యాచ్‌ ఆడింది. ఆథ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్‌ హేల్స్‌ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో ఆసీస్‌ వీరోచితంగా పోరాడి ఓడింది. 

ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ మూడవ బంతికి వేడ్‌ పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. క్యాచ్‌ అందుకునేందుకు వుడ్‌ స్ట్రయికర్‌ ఎండ్‌కు పరుగెడుతుండగా.. అప్పటికీ క్రీజ్‌ దిశగా బయల్దేరిన వేడ్‌.. వుడ్‌ను ఉద్దేశపూర్వకంగా గట్టిగా తోసేసి క్యాచ్‌ నేలపాలయ్యేలా చేశాడు. 

ఐసీసీ నిబంధనల ప్రకారం క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫీల్డర్‌ని ఉద్దేశపూర్వకంగా ఆపితే సదరు బ్యాటర్‌ని అవుట్‌గా ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ అప్పీల్‌ చేయకపోవడంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్‌ అనంతరం బట్లర్‌ను ఈ విషయమై ప్రశ్నించగా.. ఆసీస్‌ పర్యటనలో ఈ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్‌ కూడా ఆడాల్సి ఉన్నందున విషయాన్ని పెద్దది చేయదల్చుకోలేదని సమాధానం చెప్పాడు. 

కాగా, ఇంగ్లండ్‌ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్‌ మార్ష్‌ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్‌ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్‌ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే ఆఖర్లో మార్క్‌ వుడ్‌ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్‌ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 
 

మరిన్ని వార్తలు