Matthew Wade: డ్రెస్సింగ్‌ రూమ్‌ వినాశనం; వార్నింగ్‌తో సరి..

20 May, 2022 09:16 IST|Sakshi
Courtesy: IPL Twitter

గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ తాను ఔట్‌ కాదంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసిన రచ్చ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలైన వేడ్‌ తన కోపాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాకా హెల్మెట్‌, బ్యాట్‌పై చూపించాడు. వాటిని విసిరేసి.. బ్యాట్‌ను పలుమార్లు నేలకేసి కొడుతూ అసహనం వ్యక్తం చేశాడు.

కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక వినాశనం సృష్టించిన వేడ్‌ను ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరికతో సరిపెట్టింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేసి వేడ్‌ ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవెల్‌-1 నిబంధన ఉల్లఘించాడు. అయితే ఎవరిపై తన కోపాన్ని వ్యక్తం చేయకుండా.. కేవలం తన వస్తువులను మాత్రమే నాశనం చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకొని వేడ్‌ది మొదటి తప్పుగా భావిస్తూ హెచ్చరికతో వదిలేస్తున్నామని.. ఎటువంటి జరిమానా విధించడం లేదని ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. 


PC: IPL Twitter
ఈ సీజన్‌లో మాథ్యూ వేడ్‌ పెద్దగా రాణించింది లేదు. అసలే సరిగా ఆడడం లేదన్న బాధ.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం వేడ్‌కు మరింత చికాకు తెప్పించాయి. అందుకే సహనం కోల్పోయిన వేడ్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ సమయంలో పక్కన ఎవరైన ఉండి అతను గాయపడితే పరిస్థితి వేరుగా ఉండేదే. ఇక మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన వేడ్‌ మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

తొలుత టైటాన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్‌ (25 బంతుల్లో 34; 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాత కోహ్లిలా చెలరేగాడు. డుప్లెసిస్‌ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్‌ పట్టిన మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును చకచకా లక్ష్యానికి చేర్చాడు.  

చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్‌.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్‌

మరిన్ని వార్తలు