Spanish Grand Prix: వెర్‌స్టాపెన్‌ ‘హ్యాట్రిక్‌’.. సీజన్‌లో వరుసగా మూడో విజయం  

5 Jun, 2023 10:19 IST|Sakshi

మోంట్‌మెలో (స్పెయిన్‌): ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ప్రిలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. 66 ల్యాప్‌ల రేసును ‘పోల్‌ పొజిషన్‌’ తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ఒక గంటా 27 నిమిషాల 57.940 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.

హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో, రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో, పెరెజ్‌ (రెడ్‌బుల్‌) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది వరుసగా మూడో విజయంకాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్‌ కావడం విశేషం. ఈ సీజన్‌లో మొత్తం ఏడు రేసులు జరగ్గా ... ఏడింటిలోనూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్లే విజేతగా నిలువడం గమనార్హం. వెర్‌స్టాపెన్‌ బహ్రెయిన్, ఆ్రస్టేలియా, మయామి, మొనాకో, స్పానిష్‌ రేసుల్లో నెగ్గగా... పెరెజ్‌ సౌదీ అరేబియా, అజర్‌బైజాన్‌ రేసుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లోని ఎనిమిదో రేసు కెనడియన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది.       

మరిన్ని వార్తలు