సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌.. తెరమీదకు మయాంక్‌ అగర్వాల్‌ పేరు! రిలేషన్‌ ఏంటి?

25 May, 2023 19:15 IST|Sakshi

Mayank Agarwal- CBI director Praveen Sood: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ సూద్‌ బాధ్యతలు చేపట్టిన వేళ టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పేరు తెరమీదకు తీసుకువచ్చారు అభిమానులు. ఇందుకు ఓ కారణం ఉంది.. అదేంటంటే..

టీమిండియా ఓపెనర్‌గా
కర్ణాటకకు చెందిన మయాంక్‌..  2018లో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2020లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా ఓపెనర్‌గా మంచి గుర్తింపు సంపాదించిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ ఇప్పటి వరకు కెరీర్‌లో మొత్తంగా 21 టెస్టులు ఆడాడు.

36 ఇన్నింగ్స్‌లలో కలిపి 1488 పరుగులు సాధించాడు. ఇందులో  4 సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం దక్కించుకున్న మయాంక్‌.. 86 పరుగులకే పరిమితమయ్యాడు. 

మయాంక్‌- ఆషితా ప్రేమకథ అలా మొదలైంది
ఇక మయాంక్‌ అగర్వాల్‌ కెరీర్‌ సంగతులు ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మయాంక్‌ అగర్వాల్‌ది ప్రేమ వివాహం. అతడి భార్య పేరు ఆషితా సూద్‌. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయమైన వీరిద్దరు తొలుత స్నేహితులుగా దగ్గరయ్యారు.

కాలక్రమంలో స్నేహం ప్రేమగా మారింది. ఆషితాకు తన మనసులో మాట చెప్పేందుకు సిద్దమైన మయాంక్‌.. లండన్‌లో రొమాంటిక్‌ స్టైల్లో ఆమె ముందు పెళ్లి ప్రపోజల్‌ ఉంచాడు. ఇందుకు ఆషితా సానుకూలంగా స్పందించడంతో 2018 జనవరిలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

మయాంక్‌కు స్వయానా మామగారు
అదే ఏడాది జూన్‌ 4న మయాంక్‌- ఆషితాల పెళ్లి జరిగింది. సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు మయాంక్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ కేఎల్‌ రాహుల్‌ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. మయాంక్‌ ప్రేమించి పెళ్లాడిన ఆషితా మరెవరో కాదు.. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌ సూద్‌ కుమార్తె.

కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ కూతురైన ఆషితా.. వృత్తి రిత్యా లాయర్‌. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లాలో ఆమె మాస్టర్స్‌ చేశారు. అదీ విషయం.. టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌.. ప్రవీణ్‌ సూద్‌కు స్వయానా అల్లుడు. మామగారు ఉన్నత పదవి చేపట్టడంతో అభిమానులు ఇలా మయాంక్‌ పేరును వార్తల్లోకి తెచ్చారు. ఇక మయాంక్‌- ఆషితాలకు ఓ కుమార్తె ఉంది.

ఇదిలా ఉంటే.. 2011లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన మయాంక్‌ ప్రస్తుత సీజన్‌ ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మినీ వేలంలో 8.25 కోట్ల రూపాయల భారీ ధరకు రైజర్స్‌ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఈ ఎడిషన్‌లో ఈ కర్ణాటక బ్యాటర్‌ అంచనాలు అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 270 పరుగులే చేశాడు.

చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్‌ యాజమాన్యానికి సజ్జనార్‌ రిక్వెస్ట్‌.. ట్వీట్‌తో..
ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు..

మరిన్ని వార్తలు