Mayank Agarwal: శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే!

13 Aug, 2022 15:15 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ చాన్నాళ్ల తర్వాత సూపర్‌ శతకంతో చెలరేగాడు. 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అతని ధాటికి ప్రత్యర్థి జట్టు 9 వికెట్ల తేడాతో భారీ పరజయాన్ని మూటగట్టుకుంది. విషయంలోకి వెళితే.. మహారాజ ట్రోపీ కెస్‌సీఏ టి20 చాలెంజ్‌లో భాగంగా శుక్రవారం శివమొగ్గ స్ట్రైకర్స్‌, బెంగళూరు బ్లాస్టర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శివమొగ్గ స్ట్రైకర్స్‌ 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహన్‌ కదమ్‌ 52 బంతుల్లో 84, బీఆర్‌ శరత్‌ 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్‌ 15.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీతో చెలరేగగా.. ఎల్‌ ఆర్‌ చేతన్‌ 34, అనీస్‌ కెవి(35 నాటౌట్‌) సహకారమందించారు.

ఇక మయాంక్‌ అగర్వాల్‌ టీమిండియా జట్టులో స్థానం కోల్పోయి చాలా కాలం అయిపోయింది. మళ్లీ జట్టులోకి వచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ వెళ్లిపోయిన తర్వాత పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్‌ అటు బ్యాటింగ్‌లో.. ఇటు కెప్టెన్సీలో ఘోరంగా విఫలమయ్యాడు. మరోసారి లీగ్‌ దశలోనే పంజాబ్‌ ఇంటిబాట పట్టింది. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల ప్రతిభకు కొదువ లేదు.

రోజుకో కొత్త క్రికెటర్‌ తెర మీదకు వస్తుండడం.. ఒక్కోసారి జట్టును ఎంపిక చేయడంలో బీసీసీఐకి కూడా తలనొప్పిగా మారిపోయింది. ఎఫ్‌టీపీలో భాగంగా టీమిండియాకు బిజీ షెడ్యూల్‌ ఉన్న నేపథ్యంలో ఒక సీనియర్‌.. మరొకటి జూనియర్‌ జట్టుగా విడదీసి ఆయా టోర్నీలు ఆడేందుకు పంపిస్తున్నారు. ఇంత పోటీతత్వంలో మయాంక్‌ టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకుంటాడా అంటే చెప్పడం కష్టమే అవుతుంది.

చదవండి: Adam Lyth: సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు