కింగ్స్‌ పంజాబ్‌ ఇరగదీసింది..

27 Sep, 2020 21:13 IST|Sakshi

షార్జా: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించాడు.  ఐపీఎల్‌ అంటే ఇది కదా అనేంతగా రెచ్చిపోయి ఆడాడు. రాజస్తాన్‌కు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీల మోత మోగించి తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన మయాంక్‌.. మరో 19 బంతుల్లో దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 45 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో శతకం సాధించి అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా మయాంక్‌ నిలిచాడు. అంతకుముందు యూసఫ్‌ పఠాన్‌ 37 బంతుల్లో సెంచరీ సాధించగా, ఆ తర్వాత స్థానంలో మయాంక్‌ నిలిచాడు. ఈ క్రమంలోనే 46 బంతుల్లో సెంచరీ సాధించి ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న మురళీ విజయ్‌ను మయాంక్‌ అధిగమించాడు. 

టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ముందుగా కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్‌ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్‌ అర్థ శతకం సాధించాడు.  మయాంక్‌ ధాటిగా ఆడటంతో రాహుల్‌ ఎక్కువ  స్టైక్‌ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్‌ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో  10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. టామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ పెవిలియన్‌ చేరగా, రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. మయాంక్‌ ఔటైన మరుసటి ఓవర్‌లోనే రాహుల్‌ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్‌; 9 బంతుల్లో 2ఫోర్లు)‌, పూరన్‌(25 నాటౌట్‌; 8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో  కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి  223 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు