మహిళలే అధిగమించారు

5 Apr, 2021 04:29 IST|Sakshi

వన్డేల్లో వరుసగా 22వ గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ రికార్డు

21 విజయాలతో ఆసీస్‌ పురుషుల జట్టు పేరిట ఉన్న రికార్డు బద్దలు

మౌంట్‌ మాంగనుయ్‌: మహిళలు ఆకాశంలో సగమే కాదు... రికార్డుల్లోనూ ఘనమని చేతల్లో చాటారు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు పేరిట ఉన్న వరుస వన్డే విజయాల రికార్డును ఆ దేశ మహిళల క్రికెట్‌ జట్టు అధిగమించింది. న్యూజి లాండ్‌ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో మెగ్‌ లానింగ్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా 22 వన్డేల్లో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 2003లో రికీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన 21 వరుస విజయాల రికార్డు తెరమరుగైంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు జైత్రయాత్ర 2018 మార్చి 12న మొదలైంది.

ఈ క్రమంలో ఆసీస్‌ 3–0తో భారత్‌పై... 3–0తో పాకిస్తాన్‌పై... 3–0తో న్యూజిలాండ్‌పై... 3–0తో ఇంగ్లండ్‌పై... 3–0తో వెస్టిండీస్‌పై... 3–0తో శ్రీలంకపై... 3–0తో న్యూజిలాండ్‌పై గెలిచి 2020 అక్టోబర్‌ 7న ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరిట ఉన్న 21 వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 212 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ లారెన్‌ డాన్‌ (90; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకుంది. కెప్టెన్‌ అమీ సాటెర్‌వైట్‌ (32; 3 ఫోర్లు), అమెలియా కెర్‌ (33; 4 ఫోర్లు) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో మెగాన్‌ షుట్‌ 4, నికోలా క్యారీ 3 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ అలీసా హీలీ (65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అష్లే గార్డ్‌నెర్‌ (53 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్‌ పెర్రీ (56 నాటౌట్‌; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. కివీస్‌ బౌలర్లలో జెస్‌ కెర్, హన్నా రోవ్, అమెలియా కెర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు