FIH WC 2023: క్వార్టర్స్‌లో ఓడినా జపాన్‌ను చిత్తు చేసి.. 100వ మ్యాచ్‌లో అతిపెద్ద విజయం

27 Jan, 2023 10:20 IST|Sakshi
జపాన్‌ను చిత్తు చేసిన భారత్‌ (PC: Hockey India)

India Vs Japan Highlights- రూర్కెలా: న్యూజిలాండ్‌ చేతిలో ఓడి క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలు కోల్పోయిన భారత హాకీ జట్టు ప్రపంచకప్‌ తర్వాతి మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది. 9–16 స్థానాల కోసం నిర్వహిస్తున్న వర్గీకరణ పోరులో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8–0 గోల్స్‌ తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది.

రెండో క్వార్టర్‌లో అద్భుతం
తొలి రెండు క్వార్టర్‌లలో ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేకపోయిన భారత్‌... తర్వాతి రెండు క్వార్టర్‌లలో చెరో 4 గోల్స్‌తో చెలరేగింది. భారత్‌ తరఫున అభిషేక్‌ (35వ, 43వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (45వ, 58వ ని.లో)రెండు గోల్స్‌ చొప్పున చేయగా... మన్‌దీప్‌ సింగ్‌ (32వ ని.లో), వివేక్‌ సాగర్‌ (39వ ని.లో), మన్‌ప్రీత్‌ సింగ్‌ (58వ ని.లో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (59వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు.

వీటిలో 3 ఫీల్డ్‌ గోల్స్‌ కాగా, 5 గోల్స్‌ పెనాల్టీ కార్నర్‌ల ద్వారా వచ్చాయి. తొలి నాలుగు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలచలేకపోయిన భారత్‌ ఎట్టకేలకు మూడో క్వార్టర్‌లో పెనాల్టీ ద్వారా ఖాతా తెరిచింది. మరో మూడు నిమిషాల తర్వాత వివేక్‌ ఇచ్చిన పాస్‌ను అభిషేక్‌ గోల్‌గా మలిచాడు.

ఇక హర్మన్‌ప్రీత్‌ సహకారంతో ప్రసాద్‌ ప్రపంచకప్‌లో తన తొలి గోల్‌ నమోదు చేయగా, రివర్స్‌ షాట్‌తో గోల్‌ సాధించి అభిషేక్‌ జట్టును 4–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరి క్వార్టర్‌ ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్‌ గోల్‌ చేయగా... ఆఖర్లో రెండు నిమిషాల వ్యవధిలో భారత్‌ మరో మూడు గోల్స్‌ సాధించింది. 9–12 స్థానాల కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతుంది.

మీకు తెలుసా?
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది 100వ మ్యాచ్‌. ఇక వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే పెద్ద విజయం. 1975లో ఘనాపై 7–0తో గెలిచింది. 

చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్‌ అంటే అంతే! టాస్‌ గెలిస్తే... 
Babar Azam: బాబర్‌ ఆజమ్‌కు డబుల్‌ ధమాకా.. వన్డే క్రికెటర్‌ అవార్డుతో పాటు ఐసీసీ అత్యున్నత ట్రోఫీ

మరిన్ని వార్తలు