మెస్సీ ప్రపంచ రికార్డు

24 Dec, 2020 01:13 IST|Sakshi

ఒకే క్లబ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా ఘనత

644 గోల్స్‌ చేసి పీలే రికార్డును బద్దలు కొట్టిన అర్జెంటీనా స్టార్‌

బార్సిలోనా (స్పెయిన్‌): ఫుట్‌బాల్‌ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్‌ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్‌ లయనెల్‌ మెస్సీ బద్దలు కొట్టాడు. ఒకే క్లబ్‌ జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా 33 ఏళ్ల మెస్సీ గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా 643 గోల్స్‌తో బ్రెజిల్‌ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డును గత ఆదివారం మెస్సీ సమం చేశాడు.  పీలే 1957 నుంచి 1974 వరకు బ్రెజిల్‌లోని సాంటోస్‌ క్లబ్‌ తరఫున ఆడిన పీలే 643 గోల్స్‌ సాధించాడు.

భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన స్పానిష్‌ లీగ్‌లో రియల్‌ వాలాడోలిడ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 3–0తో గెలిచింది. ఆట 65వ నిమిషంలో మెస్సీ గోల్‌ చేసి పీలే రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో మెస్సీ 2004 నుంచి బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీలే 643 గోల్స్‌ను 757 మ్యాచ్‌ల్లో చేయగా... మెస్సీ 644 గోల్స్‌ను 749 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ జాబితాలో గెర్డ్‌ ముల్లర్‌ (బయెర్న్‌ మ్యూనిక్‌–564 గోల్స్‌) మూడో స్థానంలో... ఫెర్నాండో పెరోటియో (స్పోర్టింగ్‌ లిస్బన్‌–544 గోల్స్‌) నాలుగో స్థానంలో... జోసెఫ్‌ బికాన్‌ (స్లావియా ప్రాగ్‌–534 గోల్స్‌) ఐదో స్థానంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు