Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం

28 Mar, 2023 09:01 IST|Sakshi

మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌ సాధించి ఇప్పటికి మూడు నెలలు కావొస్తుంది. కానీ ఇంకా అది ఒడవని ముచ్చటలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మూడు నెలలైనా ఇంకా మెస్సీ నామస్మరణ మారుమోగుతూనే ఉంది.  వరల్డ్‌కప్‌ సాధించినప్పటి నుంచి మెస్సీకి ఏదో ఒక చోట గౌరవ సత్కారాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా సౌత్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెస్సీకి అరుదైన గౌరవంతో సత్కరించింది. సౌత్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ హెడ్‌క్వార్టర్స్‌ అయిన కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించినందుకు గానూ ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్‌ కౌన్సిల్‌ పేర్కొంది.

కాగా ఫుట్‌బాల్‌లో దిగ్గజాలుగా పేరు పొందిన డీగో మారడోనా, పీలే తర్వాత కాన్‌మిబోల్‌ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న మూడో ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కాడు. ఇక గతేడాది డిసెంబర్‌లో ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించిన అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం అంతా తానై నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌ కొట్టి గోల్డెన్‌ బాల్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇటీవలే బ్యూనస్‌ ఎయిర్స్‌లో పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్‌ చేశాడు. ఇది మెస్సీకి 800వ గోల్‌ కావడం విశేషం. ఇక అర్జెంటీనా తరపున 99వ గోల్స్‌ సాధించిన మెస్సీ వందో గోల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.

చదవండి: దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్‌ ఖాతాలో రెండో విజయం  

మరిన్ని వార్తలు