Lionel Messi: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్‌ చూడాల్సిందే

27 Nov, 2022 08:24 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు టైటిల్‌ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న లియోనల్‌ మెస్సీ ఆ దిశగా అడుగులేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో తాను గోల్‌ చేసినప్పటికి సౌదీ అరేబియా చేతిలో చిత్తవ్వడం మెస్సీ బాధించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతం అయ్యాడు. అయితే తొలి మ్యాచ్‌ ఓటమికి కుంగిపోకుండా మరుసటి మ్యాచ్‌లో మెస్సీ అంతా తానై నడిపించాడు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగంలో గోల్‌ రాకపోయేసరికి మ్యాచ్‌ డ్రా అవుతుందా అని అభిమానులు భయపడ్డారు. కానీ మెస్సీ ఆ అవకాశం ఇవ్వలేదు.

ఆట 62వ నిమిషంలో మెస్సీ కళ్లు చెదిరే గోల్‌తో మెరిశాడు. తన సహచర ఆటగాడు అందించిన పాస్‌ను చక్కగా వినియోగించుకున్న మెస్సీ ఎలాంటి పొరపాటు చేయడకుండా లో స్ట్రైక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. అలా అర్జెంటీనాకు తొలి గోల్‌ లభించింది. ఆ తర్వాత 82వ నిమిషంలో ఫెర్నాండేజ్‌ మరో గోల్‌ కొట్టడంతో అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. ఏది ఏమైనా మెస్సీ కొట్టిన గోల్‌ జట్టుకు దైర్యాన్ని ఇవ్వడంతో పాటు విజయం దిశగా నడిపించింది.

ఈ క్రమంలోనే మెస్సీ అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా రికార్డును సమం చేశాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ 8 గోల్స్‌ చేశాడు. 1982, 1986, 1990,1994లో మారడోనా ఈ గోల్స్‌ చేశాడు. తాజాగా మెస్సీ మారడోనా గోల్స్‌ రికార్డును సమం చేశాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్‌ రికార్డు దిగ్గజం గాబ్రియెల్‌ బటిస్టుటా పేరిట ఉంది. గాబ్రియెల్‌ మొత్తంగా 10 గోల్స్‌ కొట్టాడు. గాబ్రియెల్‌ రికార్డును బద్దలు కొట్టేందుకు మెస్సీ కేవలం మూడు గోల్స్‌ దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక అర్జెంటీనా తరపున ఫిఫా వరల్డ్‌కప్‌లో 21వ మ్యాచ్‌ ఆడుతున్న మెస్సీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఇక 2014లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టులో మెస్సీ సభ్యుడిగా ఉన్నాడు. తాజాగా కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తనకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ అని ఊహిస్తున్న దశలో మెస్సీ ఎలాగైనా ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించి తన కలను సాకారం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అర్జెంటీనా 1978, 1986 ఫిఫా వరల్డకప్స్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

చదవండి: మెస్సీ గురి అదిరింది.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌ ఆశలు సజీవం

మరిన్ని వార్తలు