మెస్సీ అసోంలో పుట్టాడు..!

19 Dec, 2022 21:42 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌-2022 విజేతగా అర్జెంటీనా ఆవిర్భవించిన క్షణం నుంచి ఆ జట్టు స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీపై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. విశ్వం నలుమూలల్లో ఉన్న ఫుట్‌బాల్‌ అభిమానులు మెస్సీని గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (GOAT) అని సంబోధిస్తూ ఆకాశానికెత్తుతున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ పూర్తై 24 గంటలు గడుస్తున్నా మెస్సీ నామస్మరణతో ప్రపంచ వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి హైరేటెడ్‌ సెలబ్రిటీల వరకు మెస్సీని అభినందనలతో (సోషల్‌మీడియా వేదికగా) ముంచెత్తుతున్నారు. 

ఎంతో మంది లాగే మన దేశంలోని అసోం రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ట్విటర్‌ వేదికగా మెస్సీని అభినందించాడు. అసోంకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అబ్దుల్‌ ఖలీక్‌ మెస్సీని అభినందిస్తూ.. అసోంతో మీకు సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నామంటూ పొంతన లేని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు.

మెస్సీ ఏంటి.. అసోంతో సంబంధం ఏంటీ అంటూ సందిగ్ధంలో ఉండిపోయారు. సదరు ఎంపీ గారు చెప్పింది నిజమేనా అని ఓ సారి క్రాస్‌ చెక్‌ కూడా చేసుకున్నారు. ఓ నెటిజన్‌ అయితే మెస్సీకి అసోంతో కనెక్షన్‌ నిజమేనా అని ఎంపీ గారిని ప్రశ్నించాడు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. అవును, మెస్సీ అసోంలోనే పుట్టాడు అంటూ బదులిచ్చాడు.

ఈ ట్వీట్‌లు కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్‌ చేసుకుని ఫేక్‌ న్యూస్‌ అని తేల్చేసిన నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీని ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఎంపీ గారి అజ్ఞానాన్ని ఏకి పారేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో తప్పు తెలుసుకున్న సదరు ఎంపీ తన ట్వీట్లను తొలగించారు. అబ్దుల్‌ ఖలీక్‌ అసోంలోని బార్‌ పేట్‌ లోక్‌సభ స్థానానికి పాత్రినిధ్యం వహిస్తున్నాడు. 

కాగా, ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా నిన్న (డిసెంబర్‌ 18) ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో మెస్సీ 2 గోల్స్‌తో మాయాజాలం చేసి అర్జెంటీనాను జగజ్జేతగా నిలపడమే కాకుండా వరల్డ్‌కప్‌ గెలవాలన్న తన చిరకాల కోరికను సైతం నెరవేర్చుకున్నాడు. అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను 4-2 గోల్స్‌ తేడాతో ఓడించి మూడోసారి (1978, 1986, 2022) జగజ్జేతగా ఆవిర్భవించింది.

హోరాహోరీగా సాగిన ఫైనల్లో నిర్ణీత సమయంతో పాటు 30 నిమిషాల అదనపు సమయం తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో (3-3) మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్‌లో మెస్సీ సేన 4 గోల్స్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ 2 గోల్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. నిర్ణీత సమయంలో ఆర్జెంటీనా తరఫున మెస్సీ 2 గోల్స్‌, ఏంజెల్‌ డి మారియ ఒక గోల్‌ సాధించగా.. ఫ్రాన్స్‌ తరఫున కైలియన్‌ ఎంబపే హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టాడు. 

మరిన్ని వార్తలు