Nari Contractor: టీమిండియా మాజీ కెప్టెన్‌ తలలో మెటల్‌ ప్లేట్‌.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!

7 Apr, 2022 19:26 IST|Sakshi
టీమిండియా మాజీ క్రికెటర్‌ నారీ కాంట్రాక్టర్‌

నారీ కాంట్రాక్టర్‌.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు.  కాలంలో కొంచెం వెనక్కి వెళితే మాత్రం నారీ కాంట్రాక్టర్‌ పేరు సుపరిచితమే. 1950-60ల మధ్య కాలంలో టీమిండియా క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాదు నారీ కాంట్రాక్టర్‌ టీమిండియాకు కెప్టెన్‌గానూ పని చేయడం విశేషం. ఇదంతా సరే.. ఇప్పుడెందుకు ఈ క్రికెటర్‌ ప్రస్తావన అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం.

బౌన్సర్‌ దాటికి నారీ కాంట్రాక్టర్‌ తలకు దెబ్బ తగలడంతో క్రికెట్‌ కెరీర్‌ అర్థంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత అతని తలలో ఒక మెటల్‌ ప్లేట్‌ అమర్చారు. ఇదంతా 1962 నాటి మాట.. కట్‌చేస్తే 60 ఏళ్ల తర్వాత వైద్యులు నారీ కాంట్రాక్టర్‌ తలలో నుంచి మెటల్‌ ప్లేట్‌ను విజయవంతగా తొలగించారు. ప్రస్తుతం నారీ కాంట్రాక్టర్‌ వయసు 80 ఏళ్లు. మెటల్‌ ప్లేట్‌ తొలగింపు తర్వాత ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు నారీ కాంట్రాక్టర్‌ కుమారుడు హెషెడర్‌ పేర్కొన్నాడు.

అసలేం జరిగింది..?
1962లో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. ఆ పర్యటనే నారీ కాంట్రాక్టర్‌ క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుంతుందని బహుశా ఊహించి ఉండడు. విండీస్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బౌలర్‌ వేసిన బౌన్సర్‌ నారీ కాంట్రాక్టర్‌ తలకు బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే నారీ కాంట్రాక్టర్‌ కుప్పకూలాడు. అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆ తర్వాత భారతదేశానికి పంపించారు. తమిళనాడుకు చెందిన డాక్టర్‌ చండీ ఆధ్వర్యంలో నారీ కాంట్రాక్టర్‌ తలకు తగిలిన దెబ్బను పరిశీలించి మెటల్‌ ప్లేట్‌ను అమర్చారు.


అప్పటినుంచి బాగానే ఉన్నప్పటికి ఇటీవలే స్కానింగ్‌ చేయగా.. మెటల్‌ ప్లేట్‌ వల్ల చర్మం ఉడిపోతూ వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్‌ నిర్వహించి తలలోని మెటల్‌ ప్లేట్‌ను తొలగించారు. కాగా నారీ కాంట్రాక్టర్‌ తలకు దెబ్బ తగలడానికి ముందే ఔటయ్యే అవకాశం వచ్చింది. నారీ ఇచ్చిన క్యాచ్‌ విండీస్‌ ఫీల్డర్‌ జారవిడవడంతో.. బౌన్సర్‌ ఆడి శాశ్వతంగా క్రికెట్‌కు దూరమయ్యాడు నారీ కాంట్రాక్టర్‌. టీమిండియా తరపున 1955-62 మధ్య కాలంలో 31 టెస్టుల్లో 1611 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 1955-62 మధ్య కొంతకాలం టీమిండియా కెప్టెన్‌గానూ పని చేశాడు.

చదవండి: Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్‌చేస్తే

మ్యాచ్‌ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్‌ ఏంటంటే

మరిన్ని వార్తలు