-

ఢిల్లీతో పోరులో రోహిత్‌ శర్మ భారీ స్కోర్‌ సాధిస్తాడన్న రవిశాస్త్రి

21 May, 2022 13:28 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 21) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. ప్లే ఆఫ్స్‌ నాలుగో స్థానాన్ని ఖరారు చేసే ఈ బిగ్‌ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌.. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. 13 మ్యాచ్‌ల్లో 10 పరాజయాలతో ముంబై ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించగా.. 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు (14 పాయింట్లు, 0.225 రన్‌రేట్‌) సాధించిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది, ఆర్సీబీ (16 పాయింట్లు, -0.253 రన్‌రేట్‌)ని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక సమరం కోసం క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముంబైతో ఢిల్లీ సమరం ఆర్సీబీ ఫేట్‌ను డిసైడ్‌ చేసే మ్యాచ్‌ కావడంతో కోహ్లి, ఆర్సీబీ అభిమానులంతా ముంబై ఎలాగైనా గెలవాలని ప్రార్ధిస్తున్నారు. ఇందు కోసం వారు ఈగోలను పక్కకు పెట్టి రోహిత్‌ శర్మ, అతని జట్టు ముంబై ఇండియన్స్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోనుంది. ఒకవేళ ఢిల్లీ గెలిచిందా ఆర్సీబీ అవకాశాలు ఆవిరవుతాయి. 

ఈ మ్యాచ్‌ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. విరాట్‌, ఆర్సీబీ ఫ్యాన్స్‌ అంతా రోహిత్‌ శర్మ వెంటే ఉన్నారని, హిట్‌ మ్యాన్‌ సీజన్‌ లాస్ట్‌ మ్యాచ్‌లో చెలరేగిపోతాడని, ఆర్సీబీకి అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను భారీ స్కోర్‌ సాధించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. రోహిత్‌కు కోహ్లి, ఆర్సీబీ అభిమానుల మద్దతు కూడా ఉంటుంది కాబట్టి అతన్ని ఆపడం ఎవరితరం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీసీతో మ్యాచ్‌లో రోహిత్‌ కనీసం అర్ధసెంచరీ సాధిస్తాడా అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో లో జరిగిన డిబేట్‌ సందర్భంగా రవిశాస్త్రి ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

కాగా, ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ప్రతి సీజన్‌లో కనీసం ఓ హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ ప్రస్తుత సీజన్‌లో ఆ రికార్డును కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. రోహిత్‌ ఈ సీజన్‌లో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 48 అత్యధిక స్కోర్‌తో కేవలం 266 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ కాకుండా ఏకంగా శతకం బాది తన జట్టును గెలిపించాలని ఆర్సీబీ, కోహ్లి అభిమానులు కోరుకుంటున్నారు. 
చదవండి: IPL 2022: గుజరాత్‌ బ్యాటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్‌

మరిన్ని వార్తలు