IPL 2022: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఓవర్‌.. భువీ అరుదైన ఘనత

18 May, 2022 11:15 IST|Sakshi
Photo Courtesy: IPL

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 194 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ముంబై చివరి నిమిషం వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భువీ వేసిన 19వ ఓవర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన కీలక తరుణంలో బంతినందుకున్న భువీ.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్‌ ఓవర్‌ వేసి సన్‌రైజర్స్‌ విజయానికి బాటలు వేశాడు. ఈ ఓవర్‌లో బుమ్రాను యార్కర్లతో ఉక్కిరిబిక్కిరి చేసిన భువీ.. అరంగేట్రం ఆటగాడు సంజయ్‌ యాదవ్‌ వికెట్‌ పడగొట్టి మొయిడిన్‌ వికెట్‌ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో భువీ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్లు (11) వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ 14 మెయిడిన్‌ ఓవర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇర్ఫాన్ పఠాన్‌ (10), లసిత్ మలింగ (8), జస్ప్రీత్ బుమ్రా (8) టాప్ 5లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై చివరి నిమిషం వరకు పోరాడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో (190/7) నిలిచిపోయి సీజన్‌లో 10వ ఓటమిని మూటగట్టుకుంది. 
చదవండి: MI VS SRH: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌

మరిన్ని వార్తలు