Michael Bracewell: న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌కు కరోనా

15 Jun, 2022 18:48 IST|Sakshi

ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న న్యూజిలాండ్‌ జట్టుకు మరో షాక్‌  తగిలింది. రెండో టెస్ట్‌లో ఆడిన ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ కరోనా బారిన పడినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో బ్రేస్‌వెల్‌ చివరిదైన మూడో టెస్ట్‌ (జూన్ 23) ఆడటం ఆనుమానంగా మారింది.బ్రేస్‌వెల్‌ను వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండేందుకు తరలించినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ అధికారులు ప్రకటించారు. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన కొలిన్ గ్రాండ్‌హోమ్‌కు బ్రేస్‌వెల్‌ రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. 


కాగా, రెండో టెస్ట్‌కు  కొన్ని గంటల ముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా  కోవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. విలియమ్సన్‌కు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో కోవిడ్‌ నిర్థాదరణ కావడంతో ఆఖరి నిమిషంలో  రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు.మరోవైపు రెండో టెస్ట్‌ సందర్భంగా మరో ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. రెండో టెస్టు ఆఖరి రోజు  బౌలింగ్ చేస్తూ జేమీసన్ గాయపడ్డాడని.. అతని గాయం చాలా తీవ్రమైందని సమాచారం. దీంతో జేమీసన్‌ కూడా మూడో టెస్ట్‌ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ట్రెంట్ బ్రిడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు జూలు విదిల్చి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. బెయిర్‌స్టో సూపర్‌ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136), బెన్‌ స్టోక్స్‌ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75) అజేయమైన అర్ధశతకంతో చెలరేగి క్రికెట్‌ ప్రేమికులకు టీ20 క్రికెట్‌ మజాను అందించారు.
చదవండి: బెయిర్‌స్టో విధ్వంసకర శతకం.. కివీస్‌పై ఇంగ్లండ్‌ సంచలన విజయం
 

మరిన్ని వార్తలు