ODI World Cup Qualifiers: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి నమోదు

14 Apr, 2022 13:47 IST|Sakshi

Michael Leask: ఐసీసీ అసోసియేట్‌ దేశాల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. వన్డే ప్రపంచకప్‌ 2023 అర్హత పోటీల్లో భాగంగా స్కాట్లాండ్‌, పపువా న్యూ గినియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఆటగాడు మైఖేల్‌ లీస్క్‌ 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ఐసీసీ అసోసియేట్‌ దేశాలకు వన్డే క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదిన లీస్క్‌.. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి 2 పరుగులు సాధించి ఈ ఘనతను సాధించాడు. 


లీస్క్‌ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. లీస్క్‌ సాధించిన రికార్డును ఐసీసీ తమ అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. కాగా, అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్‌ డిగ్రీస్‌ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్‌పై కేవలం 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు. ఏడేళ్లు పూర్తైనా నేటికీ ఆ రికార్డు ఏబీడి పేరిటే పదిలంగా ఉంది. 

ఇదిలా ఉంటే, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 123 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, ఛేదనలో స్కాటిష్‌ బౌలర్‌ గావిన్‌ మెయిన్‌ (5/52), హమ్జా తాహిర్‌ (3/27)ల ధాటికి పపువా న్యూ గినియా 36.2 ఓవర్లలో 164 పరుగులకే చాపచుట్టేసింది. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్‌లో టోనీ ఉరా (47) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కొయెట్జర్‌ (74), బెర్రింగ్టన్‌ (56), లీస్క్‌ (50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 
చదవండి: Odean Smith: ఓ మ్యాచ్‌లో విలన్‌గా, రెండు మ్యాచ్‌ల్లో హీరోగా..!

మరిన్ని వార్తలు