Michael Vaughan: ఇంగ్లండ్‌ వివాదాస్పద వ్యాఖ్యాతపై నిషేధం..!

6 Nov, 2021 15:49 IST|Sakshi

Michael Vaughan Dropped From BBC After Racism Allegations: జాత్యాహంకార ఆరోపణల నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్‌ వాన్‌పై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ నిషేధం విధించింది. తమ ఛానల్‌లో ప్రసారమయ్యే "ద టఫర్స్‌ అండ్‌ వాన్‌ క్రికెట్‌ షో" నుంచి వాన్‌ను తప్పిస్తున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. వాన్‌ బీబీసీలో గత 12 ఏళ్లుగా టెస్ట్‌ మ్యాచ్‌ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో నాటింగ్హమ్‌తో మ్యాచ్‌ సందర్భంగా తనతో పాటు జట్టులోని పలువురు సభ్యులపై వాన్‌ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడని యార్క్‌షైర్‌ ఆటగాడు అజీమ్‌ రఫీక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీబీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ విషయమై బీబీసీ చర్యలను వాన్‌ పూర్తిగా ఖండించాడు. తనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. 1991 నుంచి 2009 వరకు ఇంగ్లండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాన్‌.. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తూ వాన్‌ చాలాసార్లు తన నోటికి పని చెప్పాడు. ఇదిలా ఉంటే, జాతి వివక్షపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) యార్క్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ (వైసీసీసీ)పై సస్పెన్షన్‌ వేటు వేసింది. వాన్‌పై ఫిర్యాదు చేసిన రఫీక్‌ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 
చదవండి: యార్క్‌షైర్‌ కౌంటీపై వేటు

మరిన్ని వార్తలు