టీమిండియా సిరీస్‌ గెలవగానే మాట మార్చేశాడు

7 Mar, 2021 12:46 IST|Sakshi

అహ్మదాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం తర్వాత ఆ జట్టు మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించలేదని.. అసలు అది టెస్టు మ్యాచ్‌ కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతటితో ఊరుకోక మొటేరా పిచ్‌ను విమర్శిస్తూ వరుస ఫోటోలు షేర్‌ చేశాడు. పిచ్‌ ప్రిపరేషన్‌.. పిచ్‌పై నా బ్యాటింగ్‌ ఎలా కొనసాగుతుందో చూడండి.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేస్తూ విమర్శలు గుప్పించాడు. నాలుగో టెస్టు ముందు వరకు విమర్శలు కొనసాగించిన వాన్‌.. టీమిండియా మ్యాచ్‌ గెలవగానే మాట మార్చేశాడు.

బీబీసీ 5 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్‌ టీమిండియా సిరీస్‌ విజయంపై స్పందించాడు. ''టీమిండియాను చూస్తే గర్వంగా ఉంది.. ముందుగా ఆసీస్‌ గడ్డపై 2-1 తేడాతో సిరీస్‌ గెలిచారు. సిరీస్‌ విజయంతో సొంతగడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో మరింత విజృంభించింది. మొదటి టెస్టు మ్యాచ​ ఓడిపోయినా.. వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌లు గెలిచి 3-1 తేడాతో సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. ఒక టెస్టు జట్టుకు కావాల్సిన అన్ని అర్హతలు ఇప్పుడు టీమిండియాకు ఉన్నాయి. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ కచ్చితంగా విజయం సాధిస్తుందని నా నమ్మకం.


రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కూడా ఇండియాలోనే జరగనుంది.. ఇది భారత జట్టుకు అడ్వాటేంజ్‌గా మారింది. అయితే మరో ఐదు నెలల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై 5 టెస్టుల సిరీస్‌ ఆడేందుకు టీమిండియా రానుంది. ప్రస్తుత ఫామ్‌ దృష్యా వారిని ఓడించడం కష్టమే.. ఒకవేళ టీమిండియా ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ గెలిస్తే మాత‍్రం ఇకపై వారిపై ఎలాంటి బెట్‌ వేయను. బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు అంతా కలిసి భారత్‌ ఒక అద్భుత జట్టుగా కనిపిస్తుంది. ''అంటూ చెప్పుకొచ్చాడు. 

కాగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించి సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ విజయంతో భారత్‌ స్వదేశంలో వరుసగా 13వ సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు.. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
చదవండి: 
వాన్‌.. ఇక నువ్వు మారవా!
'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్‌ సూపర్‌'
మొటేరా పిచ్‌ ఎలా తయారవుతుందో చూడండి!

మరిన్ని వార్తలు