త్రో వేయడంలో కన్ఫ్యూజన్‌‌.. అసలు మజా అక్కడే

12 Mar, 2021 11:31 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ తాజాగా షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. బంతిని త్రో వేయడంలో ఫీల్డర్లు కన్ఫ్యూజ్‌‌ కాగా  బ్యాట్స్‌మెన్‌ మాత్రం రనౌట్‌ల నుంచి తప్పించుకుంటూ రన్స్‌ పూర్తి చేశారు. ఈ ఫన్నీ ఘటన యూరోపియన్‌ క్రికెట్‌ సిరీస్‌లో చోటుచేసుకుంది. వర్మ్‌డో సీసీ, స్టాక్‌హోమ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య గురువారం లీగ్‌ మ్యాచ్‌​ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టాక్‌హోమ్‌ సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో వర్మ్‌డో బౌలర్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ థర్డ్‌మన్‌ దిశగా ఫ్లిక్‌ చేశాడు. అయితే పరుగున వెళ్లిన కీపర్‌ క్యాచ్‌ను అందుకున్నట్లే అందుకొని జారవిడిచాడు.

అప్పటికే ఒక పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ప్రయత్నించగా.. కీపర్‌ త్రో సరిగా వేయలేదు. అది ఓవర్‌ త్రో అవడం.. ఆ తర్వాత మరో ఫీల్డర్‌ త్రో సరిగ్గా వేసినా మరొక ఫీల్డర్‌ దానిని అడ్డుకొని రనౌట్‌ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. అయితే అనతు వేసిన బంతి ఈసారి కూడా వికెట్లను తాకకుండా పక్కనుంచి వెళ్లిపోయింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ మాత్రం రెండు సార్లు ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొని 4 పరుగులు పూర్తి చేశారు.

నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఒక ఆటగాడు బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేయడానికి నిలబడి ఉన్నా అతనికి ఒక్కసారి కూడా బంతి కరెక్ట్‌గా ఇవ్వకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోనూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ''ఎందుకో ఇది నాకు సరైన క్రికెట్‌లా అనిపిస్తుంది‌.. ఇలా ఆడితే వికెట్లు ఏం పడుతాయి ఎందుకు పడుతాయి'' అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు. వాన్‌ షేర్‌ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వచ్చింది. 

కాగా ఇటీవలే భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ సమయంలో తన చర్యలతో వాన్‌ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం పాలైన తర్వాత పిచ్‌పై విమర్శలు కురిపిస్తూ నాలుగో టెస్టు మొదలయ్యే వరకు పిచ్‌కు సంబంధించి రోజుకో ఫోటో షేర్‌ చేస్తూ నవ్వులపాలయ్యాడు. భారత్‌ 3-1 తేడాతో​ సిరీస్‌ గెలిచిన తర్వాత కూడా వాన్‌ తన పంతాన్ని పక్కన బెట్టకుండా.. ఇండియా ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ గెలిస్తే తాను బెట్‌లు వేయడం మానుకుంటానని మరోసారి విమర్శలు చేశాడు. కాగా భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్‌ ఈరోజు రాత్రి 7 గంటకు అహ్మదాబాద్‌ వేదికగా మొదలుకానుంది.
చదవండి: 
వైరల్‌: ధోని సిక్సర్ల వర్షం..
ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి

>
మరిన్ని వార్తలు