జాఫర్‌ బాయ్‌.. 'నీకు అసిస్టెంట్‌ అవసరం ఉన్నాడా?'

16 Jul, 2021 09:04 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ను ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ ఫన్నీ ట్రోల్‌ చేశాడు. జాఫర్‌ గురువారం ఒడిశా క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా నియామకమయ్యాడు. 2021- 2023 మధ్య కాలంలో రెండేళ్లపాటు జాఫర్‌ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాన్‌  ట్విటర్‌ వేదికగా జాఫర్‌ను ట్రోల్‌ చేశాడు. '' జాఫర్‌ బాయ్‌కి అసిస్టెంట్‌ అవసరం ఉన్నాడా?.. ఒకవేళ అసిస్టెంట్‌ అవసరం ఉంటే పిలువు.. నేను వెంటనే వచ్చేస్తా'' అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం వాన్‌ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకముందు భారత్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌ సమయంలో  జాఫర్‌, వాన్‌ల మధ్య ట్విటర్‌లో చాలాసార్లే మాటలయుద్ధం జరిగింది. 

ఇక భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు కరోనా కలకలం రేపింది. టీమిండియా యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కు యూకే డెల్టా వేరియంట్‌ లక్షణాలు ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పంత్‌తో పాటు జట్టు ట్రైనింగ్‌ అసిస్టెంట్‌/ నెట్‌ బౌలర్‌ అయిన దయానంద్‌ గరాని కూడా కరోనా బారిన పడ్డాడు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురిని కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కు పంపించారు. గరానితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, రిజర్వ్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ 10 రోజుల పాటు తమ హోటల్‌ గదుల్లోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటారని బీసీసీఐ పేర్కొంది. ఇక భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు