పాకిస్తాన్‌ క్రికెట్‌లో వినూత్న ప్రయోగం.. చరిత్రలో తొలిసారి..!

30 Jan, 2023 20:37 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆన్‌లైన్‌లో కోచింగ్‌ తీసుకోనున్న జట్టుగా పాక్‌ క్రికెట్‌ జట్టు రికార్డుల్లోకెక్కనుంది. ఆ జట్టు మాజీ హెడ్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ (ఆస్ట్రేలియా).. నాలుగేళ్ల తర్వాత తిరిగి పాక్‌ హెడ్‌ కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పాక్‌ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పీసీబీ బాస్‌ నజమ్‌ సేథీ గతవారం ఓ క్లూ వదిలాడు.

ఆర్థర్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, 90 శాతం సమస్యకు పరిష్కారం దొరికిందని, పీసీబీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందని సేథీ గతవారం ఓ ప్రెస్‌మీట్‌లో వెల్లడించాడు. ప్రస్తుత పాక్‌ కోచ్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో నూతన హెడ్‌ కోచ్‌ను నియమించుకునేందుకు పీసీబీ వేగంగా పావులు కదుపుతోంది.

ఆర్థర్‌.. పీసీబీ తొలి దశ ప్రయత్నాల్లో పాక్‌ కోచ్‌గా వ్యవహరించేందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రతిపాదన నచ్చి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం డెర్బీషైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆర్థర్‌.. మెజార్టీ శాతం పాక్‌ పాల్గొనబోయే టోర్నీలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు మాత్రం ప్రత్యక్షంగా అందుబాటులో ఉండేందుకు అంగీకరించాడని సమాచారం.

కాగా, మిక్కీ ఆర్థర్‌ ఆథ్వర్యంలో పాకిస్తాన్‌ 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాక్‌ నాకౌట్‌ దశకు చేరకుండానే నిష్క్రమించడంతో ఆర్థర్‌ తన పదవికి రాజీనామా చేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పీసీబీ ఆన్‌లైన్‌ కోచ్‌ ప్రతిపాదనపై వారి సొంత దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. స్వదేశంలో నాణ్యమైన కోచ్‌లు లేకనా అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ రచ్చరచ్చ చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు