అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ క్రికెటర్‌..

7 Apr, 2022 15:51 IST|Sakshi

దక్షిణాఫ్రికా స్టార్‌ మహిళా క్రికెటర్‌ మిగ్నాన్ డు ప్రీజ్ వన్డే, టెస్టు పార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. తన కుటుంబంతో ఎ‍క్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డు ప్రీజ్ తెలిపింది. "ఇప్పటి వరకు నాలుగు వన్డే ప్రపంచకప్‌లలో ఆడడం నా అదృష్టం. ఇవి నా జీవితంలో చాలా విలువైన జ్ఞాపకాలు. అయితే నేను ఎక్కువ సమయం నా కుటుంబంతో గడపాలి అనుకుంటున్నాను.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే విధంగా నాకెంతో మద్దతుగా నిలిచిన క్రికెట్ సౌతాఫ్రికాకు, అభిమానులకు నా ధన్యవాదాలు" అని క్రికెట్ సౌత్ ఆఫ్రికా విడుదల చేసిన ప్రకటనలో డు ప్రీజ్ పేర్కొంది. కాగా 2007 లో అంతర్జాతీయ క్రికెట్‌లో మిగ్నాన్ డు ప్రీజ్  అరంగేట్రం చేసింది.

కాగా దక్షిణాఫ్రికా తరపున  అత్యధిక వన్డేలు ఆడిన  మహిళా క్రికెటర్‌ కూడా డు ప్రీజ్ కావడం విశేషం. ఆమె తన వన్డే కెరీర్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్రీజ్.. 3760 పరుగులు సాధించింది. తన కెరీర్‌లో 18 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. 2011 నుంచి 2016 వరకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కూడా డు ప్రీజ్ బాధ్యతలు నిర్వహించింది. ఇక ఆమె చివరగా మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆడింది.

చదవండి:  IPL 2022: 51 పరుగుల దూరంలో వార్నర్‌.. తొలి విదేశీ ఆటగాడిగా!

మరిన్ని వార్తలు