భారత్‌, ఐర్లాండ్‌ తొలి టి20.. ముచ్చటగా తొమ్మిది రికార్డులు

26 Jun, 2022 10:41 IST|Sakshi

ఇండియా, ఐర్లాండ్‌ మధ్య ఇవాళ తొలి టి20 మ్యాచ్‌ జరగనుంది. ఇటీవలే సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-2తో ప్రొటిస్‌తో సంయుక్తంగా పంచుకుంది. సీనియర్లంతా ఇంగ్లండ్‌ పర్యటనలో బిజీగా ఉండడంతో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో జూనియర్‌ జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వచ్చింది. దినేశ్‌ కార్తిక్‌, భువనేశ్వర్‌, హార్దిక్‌ పాండ్యా మినహా మిగతావారికి ఐర్లాండ్‌ పర్యటన ఇదే తొలిసారి. తొలి టి20 జరగనున్న నేపథ్యంలో రికార్డులపై ఒక లుక్కేద్దాం.

ఐర్లాండ్‌ బౌలర్‌ ఆండీ మెక్‌బ్రిన్‌ అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇక క్రెయిగ్‌ యంగ్‌ కూడా 50 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి రెండు వికెట్ల దూరంలోనే ఉన్నాడు.
ఇప్పటివరకు ఐర్లాండ్‌, టీమిండియాల మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరగ్గా అన్నింటిలో భారత్‌నే విజయం వరించింది.
టీమిండియా స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరో నాలుగు వికెట్లు తీస్తే టీమిండియా తరపున టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు.ఈ నేపథ్యంలో బుమ్రాను అధిగమించనున్నాడు.
ఇషాన్‌ కిషన్‌ మరో 5 పరుగులు.. టీమిండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ 9 పరుగులు చేస్తే టి20ల్లో 500 పరుగులు పూర్తి చేసుకుంటారు.
ఐర్లాండ్‌ స్టార్‌ పాల్‌ స్టిర్లింగ్‌ మరో నాలుగు సిక్సర్లు కొడితే ఐర్లాండ్‌ తరపున టి20ల్లో వంద సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.
టి20ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న తొమ్మిదో ఆటగాడు హార్దిక్‌ పాండ్యా. పాండ్యా కంటే ముందు సెహ్వగ్‌, ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా, అజింక్యా రహానే, విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌, రిషబ్ పంత్‌ టి20ల్లో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు.
2022లో టీమిండియాకు ఐదుగురు కెప్టెన్లు మారారు. ఈ ఏడాది కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌.. తాజాగా పాండ్యా ఐదో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంతకముందు 1959లో టీమిండియాకు ఇదే తరహాలో ఒకే ఏడాదిలో ఐదుగురు కెప్టెన్లు మారారు.  హేము అధికారి, దత్తా గెక్వాడ్‌, వినూ మాన్కడ్‌, గులబ్రాయ్‌ రామ్‌చంద్‌, పంకజ్‌ రాయ్‌ టీమిండియాకు కెప్టెన్లుగా చేశారు.
డబ్లిన్‌ మైదానంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన టి20 మ్యాచ్‌లో టీమిండియా ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 2018లో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో టీమిండియా ఈ విజయాన్ని నమోదు చేసింది.
380- ఐర్లాండ్‌పై టి20ల్లో హార్దిక్‌ పాండ్యా స్ట్రైక్‌రేట్‌. 2018లో పాండ్యా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 6 నాటౌట్‌(1 బంతి), 32నాటౌట్‌(9 బంతులు) పరుగులు సాధించాడు.

చదవండి: India Vs Ireland: కొత్తవారికి అవకాశం దక్కేనా!

మరిన్ని వార్తలు