Flying Sikh: ‘ది గ్రేట్‌’ మిల్కా...

20 Jun, 2021 04:08 IST|Sakshi

అతని పరుగు...
భారత క్రీడను ‘ట్రాక్‌’పై ఎక్కించింది
అతని పరుగు... పతకాలు తెచ్చింది
అతని పరుగు... రికార్డులకెక్కింది
అతని పరుగు... పాఠమైంది
అతని పరుగు... తెరకెక్కింది
ఇప్పుడాయన ఊపిరి ఆగిపోతే ఆ పరుగు... గుండెలను బాదుకొంది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ భోరున విలపిస్తోంది. క్రీడా, రాజకీయ, సినీరంగాలను విషాదంలో ముంచింది. అథ్లెట్‌ ఆణిముత్యం లేడని, ఇక రాడనే వార్తను ఎంతకీ జీర్ణించుకోలేకపోతోంది.   

‘ఫ్లయింగ్‌ సిఖ్‌’ మిల్కా సింగ్‌ అంటే త్రుటిలో చేజారిన పతకం, చేతికందిన స్వర్ణాలు, రికార్డుకెక్కిన ఘనతలు, విడుదలైన సినిమానే కాదు. కచ్చితత్వం. కష్టపడేతత్వం. దేశవిభజనలో సర్దార్‌జీ ప్రాంతం పాక్‌లో కలిసింది. బాల్యంలోనే అనాథ అయ్యాడు. విభజనానంతర ఘర్షణల్లో మిల్కా తల్లిదండ్రుల్ని పాకిస్తానీయులు చంపేశారు. 15 ఏళ్ల కుర్రతనంలో బిక్కుబిక్కుమంటూ భారత్‌ వచ్చాడు. బూట్లు తుడిచాడు.

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని షాప్‌లో క్లీనర్‌గా చేరాడు. చిల్లర దొంగతనాలు చేసి జైలుకెళ్లాడు. అతని సోదరి నగలు అమ్మి మిల్కాను బయటకి తీసుకొచ్చింది. పడరాని పాట్లు ఎన్నో పడి నాలుగో ప్రయత్నంలో భారత ఆర్మీ(1952)లో చేరాడు. సికింద్రాబాద్‌లో విధులు. ఇక్కడే అతని అడుగులు ‘పరుగు’వైపు మళ్లించాయి. ఆ పరుగు కాస్తా అథ్లెటిక్స్‌తో ప్రేమలో పడేసింది. ఆ ప్రేమే పతకాల పంటకు దారితీసింది. ఈ పతకాలు భారతీయ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో దిగ్గజాన్ని చేశాయి.  

టాప్‌–10లో నిలిస్తే మరో గ్లాసు పాలు!
సర్దార్‌ జీ చరిత్ర అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడైనా ఘన చరితే. భవిష్యత్‌ తరాలకు అతని జీవన యానం పాఠం నేర్పుతుంది. మన పయనం పూలపాన్పు కాదని... గమ్యం చేరేదాకా పోరాటం తప్పదని బోధిస్తుంది. సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తిస్తుండగా... క్రాస్‌ కంట్రీ పోటీల్లో పరుగెత్తేవాడు. ఆర్మీ కోచ్‌ గురుదేవ్‌ ఆ పోటీల్లో టాప్‌–10లో నిలిస్తే మరో గ్లాస్‌ పాలు ఇచ్చే ఏర్పాటు చేస్తానంటే ఆరో స్థానంలో నిలిచాడు. అక్కడ ప్రత్యేక శిక్షణతో తన పరుగులో వేగాన్ని అందుకున్నాక 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు.

తర్వాత రెండేళ్లకే సర్దార్‌ చరిత్ర లిఖించడం మొదలు పెట్టాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌ (1958–ఇంగ్లండ్‌)లో 400 మీ. పరుగులో స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. అదే ఏడాది టోక్యో ఆసియా క్రీడల్లో 200 మీ., 400 మీ. బంగారు పతకాలు సాధించాడు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 0.1 సెకను తేడాతో 400 మీ. ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. కానీ అతని 45.6 సెకన్ల జాతీయ రికార్డు 38 ఏళ్లపాటు చెక్కు చెదరలేదు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు...

 
చండీగఢ్‌: తీరని శోకాన్ని మిగిల్చివెళ్లిన మిల్కా సింగ్‌ మృతి యావత్‌ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. కరోనాతో కనుమూసిన ఆయన అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో ముగించారు. ప్రముఖ గోల్ఫర్, మిల్కా కుమారుడు జీవ్‌ మిల్కాసింగ్‌ అంత్యక్రియలు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, పంజాబ్‌ గవర్నర్‌ వి.పి.సింగ్‌ బద్నోర్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల మంత్రులు మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్, సందీప్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

ప్రధాని నివాళి 
మిల్కా సింగ్‌ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రికెట్‌ దిగ్గజం సచిన్, కెప్టెన్‌ కోహ్లితో పాటు సినీలోకానికి చెందిన హేమాహేమీలు అమితాబ్‌ బచ్చన్, మోహన్‌లాల్, షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్, మహేశ్‌బాబు అజయ్‌ దేవ్‌గణ్, ఫర్హాన్‌ అక్తర్, అనిల్‌ కపూర్, తాప్సీ, సన్నీ డియోల్, సోనూ సూద్, సంజయ్‌దత్‌ తదితరులు సామాజిక మాధ్యమాల్లో నివాళులు అర్పించారు. భారత అథ్లెటిక్‌ ఆణిమూత్యాన్నే కోల్పోయిందని, యువతకు ఆయనే స్ఫూర్తి ప్రదాత అని ఈ సందర్భంగా సినీ దిగ్గజాలంతా కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు