క్రికెట్‌లో మినిమమ్‌ ఏజ్‌ పాలసీ..!

20 Nov, 2020 13:51 IST|Sakshi

దుబాయ్‌: ఇక నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాలంటే వయసు అనేది అనివార్యం. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశానికి ఇంత వయసు ఉండాలనే నిబంధన ఉండేది కాదు.. ఇప్పుడు దానికి చరమగీతం పాడింది ఐసీసీ. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలంటే 15 ఏళ్లు ఉండాలనే నిబంధనను చేర్చింది. ‘ ప్రతీ క్రికెట్‌ బోర్డు వయసు నిబంధనను అమలు చేయాల్సి ఉంది. కనీస వయసు అనేది తప్పనిసరి చేయాలి. అండర్‌-19 క్రికెట్‌లోనైనా, ద్వైపాక్షిక క్రికెట్‌లోనైనా పురుషుల క్రికెట్‌ అయినా, మహిళల క్రికెట్‌లోనైనా కనీస వయసు 15 ఏళ్లు నిండి ఉండాలి’ అని ఐసీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. (10 టీ20 మ్యాచ్‌లు ఆడితే చాలు..!)

ఒకవేళ అంతకంటే తక్కువ వయసు కల్గిన ఆటగాడిలో అపారమైన ప్రతిభ ఉండి, మానసికంగా ధృఢంగా ఉన్నాడనిపిస్తే అప్పుడు సదరు బోర్డు ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఐసీసీ తెలిపింది. గతంలో పలువురు క్రికెటర్లు 15 ఏళ్ల వయసు కంటే చిన్నవయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన సందర్భాలను చూశాం. పాకిస్తాన్‌కు చెందిన హసన్‌ రాజా 14 ఏళ్ల 227 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఫలితంగా పిన్నవయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రికార్డును సాధించాడు. హసన్‌ రాజా 1996  నుంచి 2005  మధ్యకాలంలో 16 వన్డేలకు, 7 టెస్టులకు పాక్‌ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.

భారత దిగ్గజ క్రికెటర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 15 ఏళ్లు దాటాకే అంతర్జాతీయ క్రికెట్‌ ప్రవేశం చేశాడు.  16 ఏళ్ల  205 రోజుల వయసలో సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో భాగంగా టెస్టుల్లో 15, 921 పరుగులు చేయగా, వన్డేల్లో 18, 426 పరుగులు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లలో సచిన్‌ 100 శతకాలను సాధించాడు. దాంతో వంద అంతర్జాతీయ శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా సచిన్‌ రికార్డు నెలకొల్పాడు.

మరిన్ని వార్తలు