Unmukt Chand: అమెరికన్‌ లీగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన మాజీ భారత బ్యాటర్‌

27 Sep, 2021 20:57 IST|Sakshi

Unmukt Chand Scores 132 From 69 Balls: అమెరికాలో జరుగుతున్న టోయోటా మైనర్ లీగ్‌లో భాగంగా ఆస్టిన్ అథ్లెటిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్‌, మాజీ భారత బ్యాటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ బౌండరీలు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 69 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి లీగ్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ(132 నాటౌట్‌) నమోదు చేశాడు. ఉన్ముక్త్‌  వీర విహారం ధాటికి సిలికాన్ వ్యాలీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్టిన్ అథ్లెటిక్స్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 

అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉన్ముక్త్ జట్టు.. 3 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉన్ముక్త్ తుఫాను ఇన్నింగ్స్‌తో తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఉన్ముక్త్ చేసిన స్కోర్‌లో 102 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయంటే అతను ఏ రేంజ్‌లో బ్యాటింగ్‌ చేశాడో అర్ధమవుతుంది.  ఇదిలా ఉంటే, ఈ అమెరికన్‌ లీగ్‌లో ఉన్ముక్త్‌ చంద్‌ ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తంగా 434 బంతులను ఎదుర్కొన్న అతను..  53.20 సగటు, 122.58 స్ట్రైక్ రేట్‌తో 534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ, హాఫ్‌ సెంచరీ ఉన్నాయి.
చదవండి: "ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..!

మరిన్ని వార్తలు