Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్‌ షురూ, ఫోటో వైరల్‌

6 Aug, 2021 12:00 IST|Sakshi

లిఫ్ట్ ఇచ్చిన లారీ డ్రైవ‌ర్ల‌కు గిప్ట్‌

ప్రాక్టీస్‌ షురూ, ఫోటో వైరల్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం విజేతలకు పెట్టని అభరణం. దీన్ని 2020 టోక్యో ఒలింపిక్స్ ఇండియాకు తొలి పతకాన్ని అందించిన ఘనతను చాటుకున్న వెయిల్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఈ మాటను మరోసారి నిరూపించారు. మహిళల విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత, మీరాబాయి తన కల నెరవేరడానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అరుదైన బహుమతిని అందించింది. అకాడమీకి వెళ్లేటపుడు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రినీ గౌరవించాలని భావించారు. అలా మరోసారి మీరాబాయి నెటిజన్లు హృదయాలను దోచుకుంది.

ఆమె గెల్చుకున్నది వెండి పతకం అయినా ఆమె మనకు మాత్రం 24  క్యారెట్ బంగారం. జీవితంలో సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ నెటిజనులు ఫిదా అవుతున్నారు. తాజాగా మళ్లీ ప్రాక్టీస్‌ షురూ చేసిన ఫోటోను ట్వీట్‌ చేశారు. దీంతో 2024  పారిస్‌ ఒలింపిక్స్‌కి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అంటూ అభిమానులు ట్వీట్‌ చేశారు. 2022 ఆసియా గేమ్స్‌, 2024 ఒలింపిక్స్‌  మీకోసం ఎదురు చూస్తున్నాయంటూ  ఇంకొకరు వ్యాఖ్యానించడం విశేషం.

ఉచితంగా లిప్ట్‌ ఇచ్చి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ట్రక్‌ డ్రైవర్లకు గిఫ్ట్‌ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది మీరాబాయి చాను. దాదాపు150 మంది డ్రైవ‌ర్ల‌ను ఇంటికి పిలిచి భోజ‌నం పెట్టింది. అంతేకాదు వారికి ఒక ష‌ర్ట్‌, మ‌ణిపురి కండువాను  బహుమానంగా ఇచ్చి  సత్కరించింది. శిక్షణా కేంద్రానికి  వెళ్లేందుకు  రెగ్యులర్‌గా లిఫ్ట్‌ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నానని మీరాబాయి ఈసందర్భంగా  ప్రకటించింది. కష్ట సమయంలో వారంతా   ఆదుకున్నారు. అందుకే భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది.  ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఫిల్మ్ మేకర్ నౌరెం మోహెన్ ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. 

కాగా మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మీరాబాయి తన ఇంటి నుండి  శిక్షణా  అకాడమీకి 30 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. అటు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం, ఇటు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్థోమత లేని మీరాబాయి ఇంపాల్‌కు ఇసుకను తీసుకెళ్తున్న ట్రక్కుల ద్వారానే లిఫ్ట్ తీసుకునేది. అలా కఠోర సాధనతో టోక్యో ఒలింపిక్స్‌లో తన కలను సాకారం చేసుకోవడమే కాదు, యావత్‌ దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు