మీరాబాయి ప్రపంచ రికార్డు

18 Apr, 2021 06:09 IST|Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్‌కు రెండు పతకాలు

తాష్కెంట్‌ (ఉజ్బెకిస్తాన్‌): ఆసియా సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్‌ సైఖోమ్‌ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు పతకాలను సొంతం చేసుకుంది. శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో మీరాబాయి క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగంలో స్వర్ణం... ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ ఈవెంట్‌లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 118 కేజీలతో హుయ్‌హువా జియాంగ్‌ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టింది.

స్నాచ్‌లో మీరాబాయి 86 కేజీలు బరువెత్తి ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా మీరాబాయి (86+119) 205 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 213 కేజీలతో (స్నాచ్‌లో 96+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117) జిహుయ్‌ హౌ (చైనా) స్వర్ణం... 207 కేజీలతో (స్నాచ్‌లో 89+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 118) హుయ్‌హువా జియాంగ్‌ రజతం సాధించారు. ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఒక పతకం ఇవ్వకుండా... స్నాచ్, క్లీన్‌ అండ్‌ జెర్క్, టోటల్‌ విభాగాలకు వేర్వేరు పతకాలు అందజేస్తున్నారు.  

మరిన్ని వార్తలు