పాక్‌ క్రికెట్‌లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా

6 Sep, 2021 18:28 IST|Sakshi

ఇస్లామాబాద్‌: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. హెడ్‌ కోచ్‌ మిస్సా ఉల్ హ‌క్‌, బౌలింగ్‌ కోచ్‌ వ‌కార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. పాక్‌ ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేయడం పాక్‌ క్రికెట్‌లో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను, ఆరోగ్య సమస్యలను బూచిగా చూపించి తప్పుకోవడం విశేషం. త్వరలో న్యూజిలాండ్‌తో జ‌రగబోయే సిరీస్‌ల‌కు వీరి స్థానాల్లో తాత్కాలిక కోచ్‌లుగా స‌క్లెయిన్ ముస్తాక్‌, అబ్దుల్ రజాక్‌ల‌ను నియ‌మించిన‌ట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో 15 మంది సభ్యుల పాక్‌ బృందాన్ని పీసీబీ ప్రకటించింది. బాబర్‌ అజమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్స్‌, నలుగురు ఆల్‌రౌండర్స్‌, నలుగురు ఫాస్ట్‌ బౌలర్స్‌ ఉన్నారు. ఫఖర్‌ జమన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలు రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌, మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. కాగా, ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ల సమరం అక్టోబర్‌ 24న జరగనున్న సంగతి తెలిసిందే. 

పాక్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..?

మరిన్ని వార్తలు