IND VS NZ 3rd T20: న్యూజిలాండ్‌ కొంపముంచిన సాంట్నర్‌.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయేలా చేశాడు

22 Nov, 2022 17:01 IST|Sakshi

నేపియర్‌లోని మెక్లీన్‌ పార్క్‌ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 23) జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్‌ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో 'సూర్య'ప్రతాపం (111 నాటౌట్‌) చూపించడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

మూడో టీ20లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (59), గ్లెన్‌ ఫిలిప్స్‌ (54) అర్ధసెంచరీలతో రాణించడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో భారత్‌ స్కోర్‌ 9 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 75 పరుగుల వద్ద ఉండగా, ఒక్కసారిగా వర్షం ప్రారంభమై మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ముగిసేలా చేసింది.

డీఎల్‌ఎస్‌ ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే ఈ సమయానికి టీమిండియా స్కోర్‌ 75 పరుగులు మాత్రమే ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను  డీఎల్‌ఎస్‌ టైగా ప్రకటించారు. క్రికెట్‌ చరిత్రలో ఇలా డీఎల్‌ఎస్‌ టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్‌తో కలిపి మూడు ఉన్నాయి. 2021లో నెదర్లాండ్స్‌-మలేషియా మధ్య జరిగిన మ్యాచ్‌, 2021లో మాల్టా-జిబ్రాల్టర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలాగే డక్‌వర్త్‌ లూయిస్‌ టైగా ముగిశాయి.  

న్యూజిలాండ్‌ కొంపముంచిన సాంట్నర్‌.. 
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ చేసిన ఓ చిన్న తప్పిదం ఆ జట్టు పాలిట శాపంలా మారింది. మ్యాచ్‌తో పాటు ఏకంగా సిరీస్‌ కోల్పోయేలా చేసింది. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్‌ ఆగిపోయే సమయానికి క్షణాల ముందు, అంటే 8.6వ ఓవర్లో (9వ ఓవర్‌ ఆఖరి బంతి) ఐష్‌ సోధి బౌలింగ్‌లో సాంట్నర్‌ మిస్‌ ఫీల్డింగ్‌ చేశాడు. బ్యాక్‌ వర్డ్‌ పాయింట్‌ దిశలో ఉన్న సాంట్నర్‌.. దీపక్‌ హుడా ఆడిన షాట్‌కు మిస్‌ ఫీల్డ్‌ చేయడంతో ఓ పరుగు వచ్చింది . ఇదే పరుగు న్యూజిలాండ్‌ కొంపముంచింది.   

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి ( 9 ఓవర్ల తర్వాత) టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అదే న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌ గెలిచి ఉండాలంటే టీమిండియా స్కోర్‌ 9 ఓవర్ల తర్వాత 74గా ఉండాల్సిందే.  అదే సాంట్నర్‌ 9వ ఓవర్‌ ఆఖరి బంతికి మిస్‌ ఫీల్డ్‌ చేయకుండి ఉంటే, పరుగు వచ్చేది కాదు.. న్యూజిలాండ్‌ మ్యాచ్‌ గెలిచి, సిరీస్‌ సమం చేసుకుని ఉండేది. ఈ విషయం తెలిసి మ్యాచ్‌ను అధికారికంగా టైగా ప్రకటించక ముందే సాంట్నర్‌ చాలా బాధపడ్డాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు