ఫస్ట్‌ సెంచరీ చేయనివ్వలేదని..

10 Nov, 2020 18:55 IST|Sakshi

అడిలైడ్: షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా అడిలైడ్ వేదికగా టాస్మానియన్ టైగర్స్‌, న్యూ సౌత్ వేల్స్ తలపడుతున్నాయి. న్యూ సౌత్ వేల్స్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. అయితే ఓ దశలో ఆ జట్టు 37 పరుగుల వ్యవధిలో కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. కాగా, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో న్యూ సౌత్ వేల్స్ 522 పరుగుల భారీ స్కోర్ చేసింది. అబాట్ 97 పరుగుల వద్ద ఉండగా.. ఫోర్ బాది సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే సౌత్ వేల్స్ కెప్టెన్ పీటర్ నెవిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అబోట్ తన తొలి సెంచరీని 116 బంతుల్లో చేశాడు.

అయితే పీటర్ నెవిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి మిచెల్ స్టార్క్ 86 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో కెరీర్లో తొలిసారి సెంచరీ చేసే అవకాశం లేకుండా పోయింది. సహచర బౌలర్ సీన్ అబాట్ సెంచరీ చేయడం.. తాను అరుదైన మార్క్ అందుకోకపోవడంతో స్టార్క్ అసహనం వ్యక్తం చేశాడు. డగౌట్‌లోకి వెళుతూ చేతిలో ఉన్న బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. మరోవైపు గ్లోవ్స్ విసిరిపారేశాడు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'మిచెల్ స్టార్క్ సంతోషంగా లేడు' అని రాసుకొచ్చింది. తన క్రికెట్‌ కెరీర్‌లో మిచెల్‌ స్టార్క్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 99.

ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో 522/6 వద్ద డిక్లేర్డ్‌ చేయగా,  టాస్మానియా 239 పరుగుల వద్ద ఆలౌటైంది. కాగా, న్యూసౌత్‌వేల్స్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టాస్మానియా మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. టాస్మానియా విజయానికి 322 పరుగులు కావాలి. 

మరిన్ని వార్తలు