India vs England: మిథాలీ రాజ్‌ ప్రపంచ రికార్డు

4 Jul, 2021 04:50 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు

మూడో వన్డేలో అజేయ అర్ధ సెంచరీ

నాలుగు వికెట్లతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం

వొర్సెస్టర్‌: స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ భారత మహిళల జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. మిథాలీ అజేయ అర్ధ సెంచరీ (86 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు) సాధించడంతోపాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దాంతో చివరిదైన మూడో వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ మహిళల జట్టుపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్‌ స్కివర్‌ (49; 5 ఫోర్లు), కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది.

ఓపెనర్లు స్మృతి మంధాన (49; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (19; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జెమీమా (4) విఫలమైంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (16), దీప్తి శర్మ (18; 1 ఫోర్‌) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ గెలుపుపై అనుమానాలు తలెత్తాయి. అయితే అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మిథాలీ... స్నేహ్‌ రాణా (22 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. చివర్లో స్నేహ్‌ అవుటవ్వగా... భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులుగా ఉంది. చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా... మూడో బంతిని బౌండరీ బాదిన మిథాలీ భారత్‌కు విజయాన్ని కట్టబెట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడటంతో సిరీస్‌ను

1–2తో ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది.
మిథాలీ మైలురాయి: ఈ మ్యాచ్‌ మిథాలీకి చిరస్మరణీయ మ్యాచ్‌ అయ్యింది. ఆమె వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరుకున్నపుడు మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అవతరించింది. చార్లోటి ఎడ్వర్డ్స్‌ (ఇంగ్లండ్‌; 10,273 పరుగులు) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. ప్రస్తుతం మిథాలీ మూడు ఫార్మాట్‌లలో కలిపి 10,337 పరుగులు (11 టెస్టుల్లో 669; 217 వన్డేల్లో 7,304; 89 టి20 మ్యాచ్‌ల్లో 2,364 పరుగులు) చేసింది.   

మరిన్ని వార్తలు