'మన్ కీ బాత్‌'లో మిథాలీ రాజ్‌‌ గురించి ప్రస్తావించిన మోదీ

26 Jun, 2022 18:54 IST|Sakshi

తాజాగా జరిగిన 'మన్ కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్‌ గురించి ప్రస్తావించారు. దేశంలోని యువ అథ్లెట్లకు మిథాలీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ అందించిన సేవలు చిరస్మరణీమని అన్నారు. 

మిథాలీ అసాధారణ క్రికెటర్‌ అని, క్రీడలకు సంబంధించి దేశంలోని మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలని ప్రశంసించారు. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో మిథాలీ కీలకపాత్ర పోషించిందని ఆకాశానికెత్తారు. ఇటీవలే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.  

కాగా, మిథాలీ రాజ్ జూన్ 8న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 1999 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిథాలీ 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు (7805), అత్యధిక మ్యాచ్‌లు (232), టెస్ట్‌ల్లో అతి చిన్న వయస్సులో డబుల్ సెంచరీ.. ఇలా మిథాలీ ఖాతాలో పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి.
చదవండి: 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్‌ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు


 

మరిన్ని వార్తలు