'మీరు చేస్తుంది గొప్ప పని.. అది నాకు కోపం తెప్పించింది'

27 May, 2021 15:51 IST|Sakshi

ముంబై: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. చాలా మంది కరోనా బారీన పడుతూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పలువురు టీమిండియా క్రికెటర్లు ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లతో పాటు తమకు తోచినంత సాయం అందిస్తున్నారు. గతేడాది మిథాలీ రాజ్‌ లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆహారంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. కాగా ఈ ఏడాది మిథాలీ ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలకు దూరం కావడంతో.. ఆమె తండ్రి దొరై రాజ్‌ ఆ బాధ్యతను తాను పూర్తి చేసే పనిలో పడ్డారు.  

తాజాగా మిథాలీ రాజ్‌ తండ్రి దొరై రాజ్‌ ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చేస్తున్న పనిని పొగుడుతూనే ఆయన మాస్క్‌ సరిగా ధరించనందుకు కోపం వచ్చిందని ట్విటర్‌లో తెలిపింది. '' నాన్న గతేడాది నేను చేసిన పనిని ఈసారి మీరు భుజానికి ఎత్తుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఫుడ్‌తో పాటు నిత్యావసరాలు అందించి అండగా నిలబడ్డారు. నాకోసం ఇదంతా చేస్తున్న నాన్న మాస్క్‌ మాత్రం సరిగా ధరించలేదు.. ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు కోపంగా ఉంది.'' అంటూ ట్వీట్‌ చేసింది.

కాగా టీమిండియా పరుషుల జట్టుతో పాటు మహిళల జట్టు ఒకేసారి ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరనున్నాయి. జూన్‌ 2న బీసీసీఐ ఏర్పాటు చేయనున్న చార్టడ్‌ ఫ్లైట్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. కాగా టీమిండియా పురుషుల జట్టు జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఇదే సమయంలో టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఒక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది.

మరిన్ని వార్తలు