ధోనిలా ఇంకెవరూ ఉండరు : మిథాలీ

17 Aug, 2020 21:30 IST|Sakshi

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. మరో మహేంద్ర సింగ్ ధోని ఎప్పటికీ ఉండరని మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ధోని తన చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత ఏడాది కాలంగా అతను జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్‌లో కూడా ఆడలేదు.

ఈ క్రమంలోనే బీసీసీఐ సోమవారం తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో మిథాలీ ధోనిని ప్రశంసలతో ముంచెత్తారు. ‘అతను చెప్పింది చేస్తాడు. దేశం కోసం ఆడాలని కాంక్షించే చిన్న చిన్న పట్టణాలకి చెందిన కుర్రాళ్లకి అతను ఆదర్శం. క్లిష్ట పరిస్థితులలో కూడా అతను ఉక్కు సంకల్పంతో  ప్రశాంతతతో వ్యవహరించే తీరును ఎంత పొగిడినా తక్కువే. బ్యాటింగ్ అయినా, వికెట్ కీపింగ్ అయినా అతనిది అసమానమైన శైలి. క్రికెట్ పాఠ్య పుస్తకాల్లోలేని ఆ హెలికాప్టర్ షాట్ అతని ప్రతిభ, ఆత్మ విశ్వాసానికి నిదర్శనం. అతనిలా ఇంకెవరూ ఉండరు’ అని మిథాలీ అన్నారు.

అంతర్జాతీయ కెరీర్‌లో ధోని 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ 20 మ్యాచ్‌లలో 1600 పరుగుల సాధించాడు.

మరిన్ని వార్తలు