తండ్రుల కాలం అయిపోయింది, కొడుకులు తయారయ్యారు.. సౌతాఫ్రికా-విండీస్‌ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం

22 Feb, 2023 17:31 IST|Sakshi

వెస్టిండీస్‌-సౌతాఫ్రికా (సౌతాఫ్రికన్‌ ఇన్విటేషన్‌ XI) జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 21) మొదలైన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 1990, 2000 దశకాల్లో స్టార్లుగా వెలిగిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల తనయులు ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధులుగా ఎదురెదురుపడ్డారు. ఎదురెదురుపడటమే కాకుండా తండ్రుల తరహాలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేశారు. అంతిమంగా దిగ్గజ బౌలర్‌ తనయుడు.. దిగ్గజ బ్యాటర్‌ తనయుడికి విసుగు తెప్పించి వికెట్‌ దొరకబుచ్చుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రులు, వారి పుత్రరత్నాలు ఎవరంటే..? 

వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ తనయుడు తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌, మరొకరు సౌతాఫ్రికా లెజండరీ ఫాస్ట్‌ బౌలర్‌ మఖాయ ఎన్తిని కొడుకు థాండో ఎన్తిని. 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌.. సౌతాఫ్రికన్‌ ఇన్విటేషన్‌ XI జట్టుతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్‌, థాండో ఎదురెదురు పడ్డారు. వెస్టిండీస్‌ తరఫున ఓపెనింగ్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగిన తేజ్‌నరైన్‌.. ఫాస్ట్‌ బౌలర్‌ థాండోను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో వరుస డాట్‌ బాల్స్‌తో తేజ్‌నరైన్‌ (1) సహనాన్ని పరీక్షించిన  థాండో.. ఫైనల్‌గా అతని వికెట్‌ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

నెటిజన్లు రకరాకల కామెంట్లతో ఇరువురు ఆటగాళ్ల తండ్రులను గుర్తు చేసుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయులు అంటూ వీరిని ఆకాశానికెత్తుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తేజ్‌నరైన్‌, థాండో ఇద్దరూ తండ్రుల తరహాలోనే బ్యాటింగ్‌, బౌలింగ్‌ స్టైల్‌ కలిగి ఉండటం. వీరిద్దరు అచ్చుగుద్దినట్లు తండ్రుల తరహాలోనే హావభావాలు సైతం పలికించారు. వీరిలో తేజ్‌నరైన్‌ ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. 22 ఏళ్ల థాండో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తేజ్‌నరైన్‌ 4 టెస్ట్‌ల్లో 69.67 సగటున డబుల్‌ సెంచరీ, సెంచరీ, హాఫ్‌ సెంచరీ సాయంతో 418 పరుగుల సాధించగా.. థాండో సౌతాఫ్రికా అండర్‌-19 జట్టు తరఫున సత్తా చాటాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీమ్‌ 41 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో రోజు ఆట కొనసాగుతోంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో జాషువ డిసిల్వ (55), జేసన్‌ హోల్డర్‌ (57) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికా ఆటగాళ్లు విహన్‌ లుబ్బే (67 నాటౌట్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (13 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగా.. థాండో కూడా ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. 

>
మరిన్ని వార్తలు