ఎంపీగా పరుగుల రాణి ప్రమాణం.. సంతోషంగా ఉందంటూ ప్రధాని ట్వీట్‌

20 Jul, 2022 16:30 IST|Sakshi

ఇటీవ‌లే రాజ్యసభకు నామినేట్ అయిన పరుగుల రాణి, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఇవాళ (జూలై 20) ఉదయం పార్లమెంట్‌ భవనంలో ప్రమాణం చేశారు. రాజ్యసభ స్పీకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ప్రధాని మోదీని పీటీ ఉష కలిశారు. ఈ సందర్భంగా వారు కలిసి దిగిన ఫోటోను ప్రధాని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. పార్లమెంట్‌లో పీటీ ఉషను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. 

కాగా, ద‌క్షిణాదికి చెందిన న‌లుగురు ప్ర‌ముఖులను భారతీయ జనతా పార్టీ ఇటీవలే పెద్దల సభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. పీటీ ఉష (కేరళ)తో పాటు తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ రాష్ట్రపతి కోటాలో ఎగువసభకు నామినేట్‌ చేసింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత క్రీడా విభాగం నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్‌ అయిన వ్యక్తి పీటీ ఉషనే కావడం విశేషం. 
చదవండి: పెద్దల సభకు పరుగుల రాణి

మరిన్ని వార్తలు