ఇంగ్లండ్‌ క్రికెటర్‌ మొయిన్‌ అలీ సంచలన నిర్ణయం 

7 Jun, 2023 13:51 IST|Sakshi

ఇంగ్లండ్‌ వెటరన్ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ సం​చలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్‌ను జూన్‌ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది.

తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులోని జాక్‌ లీచ్‌ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మొయిన్‌ను రిటైర్మెంట్‌ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరగా, అందుకు అతను అంగీకరించాడు. కాగా, మొయిన్‌ 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాక రెడ్‌ బాల్‌తో కనీసం ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు కూడా ఆడలేదు. అయినా ఈసీబీ ఇతనిపై నమ్మకంతో రిటైర్మెంట్‌ను సైతం వెనక్కు తీసుకునేలా చేసి, జట్టులోకి ఆహ్వానించింది.

మొయిన్‌ రాకతో ఇంగ్లండ్‌ బలం పుం​జుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఈసీబీని లోలోపల కలవరపెడుతుంది. అదేంటంటే.. మొయిన్‌కు ఆస్ట్రేలియాపై చెత్త రికార్డు ఉండటం. ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్‌.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్‌ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇది అతని కెరీర్‌ యావరేజ్‌కు రెండింతలు. కెరీర్‌లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడిన మొయిన్‌.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. 

యాషెస్‌ సిరీస్‌ తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్‌ జట్టు..
హ్యారీ బ్రూక్‌, బెన్‌ డకెట్‌, జో రూట్‌, జాక్‌ క్రాలే, డేనియల్‌ లారెన్స్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, జానీ బెయిర్‌ స్టో, ఓలీ పోప్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, మాథ్యూ పాట్స్‌, జోష్‌ టంగ్‌, మార్క్‌ వుడ్‌, ఓలీ రాబిన్సన్‌, మొయిన్‌ అలీ 

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‌ వేదికగా జరిగే యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌, జూన్‌ 16-20, ఎడ్జ్‌బాస్టన్‌ 
రెండో టెస్ట్‌, జూన్‌ 28-జులై 2, లార్డ్స్‌
మూడో టెస్ట్‌, జులై 6-10, హెడింగ్లే
నాలుగో టెస్ట్‌, జులై 19-23, ఓల్డ్‌ ట్రాఫర్డ్‌
ఐదో టెస్ట్‌, జులై 27-31, ఓవల్‌

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో!
 

మరిన్ని వార్తలు