Mooen Ali: మొయిన్‌ అలీ అరుదైన రికార్డు; టీమిండియాపై ఆరో స్పిన్నర్‌గా

13 Aug, 2021 18:39 IST|Sakshi

లార్డ్స్‌: ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ టీమిండియాపై టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్‌గా మొయిన్‌ అలీ నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో షమీ వికెట్‌ తీయడం ద్వారా అలీ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా భారత్‌పై టెస్టుల్లో మురళీధరన్‌(శ్రీలంక) 105 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. నాథన్‌ లియాన్‌(ఆస్ట్రేలియా) 94 వికెట్లతో రెండో స్థానంలో,  63 వికెట్లతో లాన్స్‌ గిబ్స్‌(వెస్టిండీస్‌) మూడో స్థానంలో, అండర్‌వుడ్‌(ఇంగ్లండ్‌) 62 వికెట్లతో నాలుగు.. 52 వికెట్లతో బెనాడ్‌(ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో చేరిన మొయిన్‌ అలీ ఇంగ్లండ్‌ తరపున 62 టెస్టుల్లో 2831 పరుగులు.. 190 వికెట్లు, 112 వన్డేల్లో 1877 పరుగులు.. 87 వికెట్లు, 38 టీ20ల్లో 437 పరుగులు.. 21 వికెట్లు తీశాడు.

ఇక టీమిండియా రెండో రోజు ఆటలో లంచ్‌ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 31, ఇషాంత్‌ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 278/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్‌ రాహుల్‌, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌, జడేజాలు ఇన్నింగ్స్‌కు కొనసాగించారు. అయితే 37 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన పంత్‌ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. 


 

మరిన్ని వార్తలు