Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్‌ ఆగ్రహం

25 May, 2022 17:52 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌.. దేశ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలకు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హఫీజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ట్విటర్‌​ వేదికగా  పంచుకున్న మహ్మద్‌ హఫీజ్‌ పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌తో పాటు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సహా పలు రాజకీయ నాయకులను ట్యాగ్‌ చేశాడు. 

''లాహోర్‌లోని పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ అందుబాటులో లేదు.. ఏటీఎంలో డబ్బులు రావడం లేదు.. మీ చెత్త రాజకీయ నిర్ణయాలతో సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి.. ఈ దేశ ప్రభుత్వం నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి'' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో పాక్‌ 23వ కొత్త ప్రధానిగా షాబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టారు.

మహ్మద్‌ హఫీజ్‌కు ఇది కొత్త కాదు. ఇంతకముందు క్రికెటర్‌గా ఉన్నంతకాలం తప్పు చేసిన ప్రతీసారి పీసీబీని ప్రశ్నిస్తూ వచ్చాడు. పీసీబీకి ఎన్నోసార్లు ఎదురెళ్లి రెబల్‌గా పేరు పొందినప్పటికి తనదైన ఆటతీరుతో జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా కొనసాగాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన మహ్మద్‌ హఫీజ్‌ అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్ 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది‌. ఫైనల్లో టీమిండియాపై హఫీజ్‌ సేన విజయం సాధించి కప్‌ ఎగురేసుకుపోయింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌ తరపున 218 వన్డేలు, 55 టెస్టులు, 119 టి20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 12వేలకు పైగా పరుగులు చేసిన హఫీజ్‌ 250కి పైగా వికెట్లు తీశాడు.

చదవండి: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్‌లో పాక్‌ బౌలర్‌ కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు