Mohammad Hafeez: అఫ్రిది అప్పుడు అలా బాదడం వల్లే అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం లేదు..!

6 Sep, 2022 16:07 IST|Sakshi

Asia Cup 2022: టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఉద్దేశించి పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ హఫీజ్‌ అవాక్కులు చవాక్కులు పేలాడు. 2014 ఆసియా కప్‌ తర్వాత భారత్‌-పాక్‌ మ్యాచ్‌ల్లో అశ్విన్‌ను ఎందుకు తీసుకోవడం లేదనే చర్చలో పాల్గొంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. 2014 ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ సందర్బంగా అశ్విన్ వేసిన చివరి ఓవర్లో షాహిద్ అఫ్రిది వరుసగా రెండు సిక్సర్లు బాది పాక్‌ను గెలిపించడమే ఇందుకు కారణమని గొప్పలు పోయాడు. 

అఫ్రిది అప్పుడు అలా బాదడం వల్లే అశ్విన్‌ను నేటికీ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ల్లో ఆడించడం లేదని పిచ్చి కూతలు కూశాడు. పీటీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. హఫీజ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలా అనుకుంటూ పోతే భారత బ్యాటర్ల ధాటికి చాలామంది పాక్‌ బౌలర్ల కెరీర్‌లే అర్ధంతరంగా ముగిసిపోయాయని కౌంటర్‌ అటాక్‌ చేస్తున్నారు. 

వాస్తవానికి అశ్విన్‌ను టీ20ల్లో ఆడించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని, యువ స్పిన్నర్లు చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుం‍డమే ఇందుకు ప్రధాన కారణమని వివరిస్తున్నారు. మరికొందరైతే.. ప్రత్యర్ధికి తమ జట్టు కూర్పుతో పని ఏంటని, ఆటగాళ్ల ఎంపికలో తమ వ్యూహాలు తమకు ఉంటాయని అంటున్నారు. అశ్విన్‌ జట్టులో ఉన్నా లేకపోయిన ఈ మధ్యకాలంలో పాక్‌ పొడించిందేమీ లేదని, కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే వారు గెలుపొందారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హఫీజ్‌ పైత్యం వదిలించారు. 

కాగా, వన్డే ఫార్మాట్‌లో జరిగిన 2014 ఆసియా కప్ మ్యాచ్‌లో (భారత్‌-పాక్‌) పాక్‌ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండింది. కెప్టెన్‌ ధోని అశ్విన్‌పై నమ్మకంతో అతనికి బంతినందించాడు. ఆ ఓవర్‌ తొలి బంతికే అజ్మల్‌ను ఔట్ చేసిన అశ్విన్‌.. ఆ తర్వాతి బంతికి సింగిల్‌ను ఇచ్చాడు. అప్పుడే స్ట్రయిక్‌లోకి వచ్చిన షాహిద్‌ అఫ్రిది.. వరుసగా రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులు మిగిలుండగానే పాక్‌కు విజయతీరాలకు చేర్చాడు.  
 

Poll
Loading...
మరిన్ని వార్తలు