Mohammed Hafeez: జూనియర్‌ క్రికెట్‌ లీగ్‌పై సంచలన కామెంట్స్ చేసిన పాక్‌ వెటరన్‌

6 May, 2022 22:17 IST|Sakshi

యువ క్రికెటర్లను గుర్తించి, వారిలోని టాలెంట్‌ను వెలికి తీసేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) తరహాలో పాకిస్తాన్ జూనియర్ క్రికెట్‌ లీగ్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ టోర్నీని ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 15 వరకూ లాహోర్ వేదికగా నిర్వహించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్‌ క్రికెట్‌ లీగ్‌పై ఆ దేశ వెటరన్‌ ఆటగాడు మహ్మద్‌ హఫీజ్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు.

19 ఏళ్లు కూడా నిండని కుర్రాళ్లతో క్రికెట్‌ ఆడించడం చైల్డ్‌ లేబర్‌తో సమానమని వ్యాఖ్యానించాడు. జూనియర్ క్రికెట్ లీగ్ అనే ఐడియా పాక్‌లో క్రికెట్ వ్యవస్థని నాశనం చేస్తుందని అన్నాడు. యువ క్రికెటర్లకు ఇలాంటి వేదిక పాక్షికంగా లాభం చేకూర్చినప్పటికీ.. భవిష్యత్తులో మానసికంగా, శారీరకంగా సమస్యలు ఎదుర్కొనేలా చేస్తుందని తెలిపాడు.

యుక్త వయసులో షార్ట్‌ క్రికెట్‌ ఆడటం వల్ల కుర్రాళ్లు బేసిక్స్‌ దగ్గరే ఆగిపోతారని, సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడటం వారి కెరీర్‌ ఎదుగుదలకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా, భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో ఆడాలంటే కుర్రాళ్ల వయసు కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలన్న నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఒక వేళ ఆటగాడి వయసు 19 దాటకపోతే, అతనికి లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు ఆడిన అనుభవమైనా ఉండాలి. ఈ నిబంధన కారణంగా భారత అండర్ 19 వరల్డ్ కప్ 2022 హీరోలు రఘువంశీ, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడే అవకాశాన్ని కోల్పోయారు. 
చదవండి: టీమిండియా విండీస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు..!

మరిన్ని వార్తలు