Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్‌ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'

22 Jun, 2022 18:18 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫేలవ ఫామ్‌తో జట్టుకు దూరమైన పుజారా ఆ తర్వాత రంజీ ట్రోపీ, కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. కౌంటీలో ససెక్స్‌ తరపున నాలుగు సెంచరీలతో హోరెత్తించిన పుజారా ఖాతాలో రెండు డబుల్‌ సెంచరీలు  ఉండడం విశేషం. పూర్తి స్థాయి ఫామ్‌ అందుకున్న పుజారా ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు  తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌ చేరుకున్న టీమిండియా జూలై 1న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది.

ఈ నేపథ్యంలోనే మహ్మద్‌ కైఫ్‌ యువ ఆటగాళ్లనుద్దేశించి పుజారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' పుజారా నుంచి యువ క్రికెటర్లు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కసారి జట్టులో స్థానం కోల్పోతే ఒక బ్యాటర్‌గా మనం చేయాల్సిన పని ఏంటనేది పుజారాను చూసి నేర్చుకోవచ్చు. ఫామ్‌ కోల్పోయిన మాత్రానా ఆందోళన చెందొద్దు. స్వదేశానికి తిరిగి వెళ్లండి. రంజీల్లో ఆడండి.. లేదంటే కౌంటీల్లో ఆడి పరుగులు సాధించి తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోండి.

పుజారా విషయంలో అదే జరిగింది. ఫామ్‌ కోల్పోయి విమర్శలు మూటగట్టుకున్న అతను కొన్ని నెలల పాటు ఏం చేశాడన్నది ఆసక్తిగా గమనించండి. పుజారా యువ క్రికెటర్లకు ఒక గుణపాఠం.. అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పుజారా గొప్ప ప్లేయర్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలో బాగా ఆడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: వాషింగ్టన్‌ సుందర్‌కు లక్కీ ఛాన్స్‌.. ప్రతిష్టాత్మక టోర్నీలో.. థాంక్యూ అంటూ భావోద్వేగం

 విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌


 

మరిన్ని వార్తలు