Neeraj Chopra: నీరజ్‌ చోప్రా విన్యాసాలు అదుర్స్‌; వీడియో వైరల్‌

10 Aug, 2021 15:32 IST|Sakshi

నీరజ్‌ చోప్రా.. ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఫైనల్లో తన అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. తద్వారా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో స్వర్ణం అందించిన తొలి వ్యక్తిగా.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్‌ చోప్రా నిలిచాడు. అయితే నీరజ్‌ చోప్రా ఈరోజు బంగారు పతకం సాధించడం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ దాగుంది. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ తన ట్విటర్‌లో నీరజ్‌ చోప్రా విన్యాసాలను షేర్‌ చేశాడు.

ఆ వీడియోలో నీరజ్‌ తన చేతిలో బరువైన వస్తువును పెట్టుకొని శరీరాన్ని పూర్తిగా విల్లులాగా వంచడం.. ఆ తర్వాత అలాగే పైకి లేవడం కనిపిస్తుంది. నీరజ్‌ చోప్రా శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందనేది చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని స్టంట్స్‌కు ఫిదా అవుతున్నారు. ''ఇదెలా సాధ్యం.. నీరజ్‌ చేస్తున్న విన్యాసాలు ఒక్కరోజులో వచ్చినవి కాదు.. దీని వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉందంటూ'' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఇక గతవారం టోక్యోలో పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ చోప్రా 87.58 మీటర్లు విసిరి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హర్యానాలోని పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా భారతదేశానికి అథ్లెటిక్స్‌లో మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచాడు.

మరిన్ని వార్తలు