Virat Kohli: ‘అందుకే కోహ్లి ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోతున్నాడు’

16 Jul, 2021 09:43 IST|Sakshi

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లి కెప్టెన్సీపై టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ మహ్మద్‌ కైఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి సారథ్యంలోని జట్టు కూర్పు అంశంలో స్పష్టత ఉండదని, ఎప్పుడు ఎవరికి ఎందుకు ఉద్వాసన పలుకుతారో తెలియనిస్థితిలో ఆటగాళ్లు ఉంటారని పేర్కొన్నాడు. జట్టు ఎంపిక విషయంలో కోహ్లి ప్రస్తుతం ఫాంలో ఉన్న క్రికెటర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తాడని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కైఫ్‌ స్పోర్ట్స్‌ తక్‌తో మాట్లాడుతూ... ‘‘ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శనను గతంలో పరిగణనలోకి తీసుకునేవాళ్లు. కానీ ప్రస్తుత కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌ అలా కాదు. 

ఇప్పుడు ఎవరు ఫాంలో ఉంటే వారినే తుదిజట్టులోకి తీసుకుంటారు. అందుకే సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి వారికి అవకాశాలు వచ్చాయి. అదే విధంగా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ కొన్ని మ్యాచ్‌లు మిస్‌ కావాల్సి వచ్చింది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీతో, కోహ్లి కెప్టెన్సీని పోలుస్తూ.. ‘‘గంగూలీ తన జట్టుకు ఎంతో మద్దతునిచ్చేవాడు. కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమైనా మరో అవకాశం ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టేవాడు. మీ వెనుక నేనున్నానంటూ తనదైన క్లాసిక్‌ స్టైల్‌తో తుదిజట్టును ఎంపిక చేసుకునేవాడు. నాయకుడి లక్షణం అది. 

కానీ, కోహ్లి అలాకాదు. జట్టులో ఎవరికీ సుస్థిరస్థానం అంటూ ఉండదు. ఈ విషయాన్ని మనందరం ఆమోదించాలి. గత ప్రదర్శననను పరిగణనలోకి తీసుకోకుండా.. ఒకటీ రెండు మ్యాచ్‌లలో ఫాం ప్రదర్శిస్తే వారిని ఎంపిక చేసుకుంటాడు. అయితే, దీర్ఘకాలంలో ఇలాంటి నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. బహుశా ఇలాంటి వాటి వల్లే తను ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు. ఏదేమైనా... ఒక కెప్టెన్‌గా ఎన్ని ఇంటర్నేషనల్‌ టైటిల్స్‌ గెలిచారన్న దానినే ఎక్కువగా హైలెట్‌ చేస్తారు కదా’’ అని కైఫ్‌ చెప్పుకొచ్చాడు. కాగా ధావన్‌ నేతృత్వంలోని టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంకకు వెళ్లగా.. కోహ్లి సారథ్యంలోని భారత జట్టు టెస్టు సిరీస్‌ నిమిత్తం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. 

మరిన్ని వార్తలు