నా తండ్రి ఆటను టీవీలో చూశా.. అప్పడే నిశ్చయించుకున్నా

12 May, 2021 14:51 IST|Sakshi

కాబుల్‌: తండ్రి క్రికెట్‌ ఆడుతుండగానే కొడుకు కూడా అదే ఆటలో రాణిస్తుండడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఆఫ్గన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ నబీకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నబీ అప్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగానే అతని కొడుకు హసన్‌ ఖాన్‌ కూడా క్రికెట్‌లో దుమ్మురేపే ప్రదర్శన నమోదు చేశాడు. ప్రస్తుతం షార్జా అకాడమీలో ట్రైనింగ్‌లో ఉన్న 16 ఏళ్ల హసన్‌ బుఖతీర్ ఎలెవెన్‌ తరపున మ్యాచ్‌ ఆడి 30 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు ఉండడం విశేషం. ఇక తన తండ్రి ఆట టీవీలో చూసి తాను క్రికెట్‌లోకి రావాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. అతని అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నానంటూ పేర్కొన్నాడు.

న్యూ నేషనల్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హసన్‌ మాట్లాడుతూ..'' నా తండ్రి ఒక క్రికెటర్‌ అని నేనప్పుడు ఒత్తిడికి లోనవ్వలేదు. అతని అడుగుజాడల్లో నడుస్తూ ఒక పెద్ద క్రికెటర్‌ కావాలనేది నా కోరిక. నా తండ్రి ఆటను ఎప్పుడు మొదటిసారి టీవీలో చూశానో అప్పుడే దేశం తరపున క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నా. నేనిప్పుడు షార్జా అకాడమీలో శిక్షణ పొందుతున్నా.. నా తొలి గురువు మాత్రం ఎప్పటికి మా నాన్నే. మా నాన్న ఏది చెబితే అది కచ్చితంగా వింటా. ఉదాహరణకు నా కోచ్‌ నాకు ఏదైనా సలహా ఇచ్చినా మొదట ఆ విషయాన్ని నా తండ్రికి చెప్పి అది మంచిదా చెడ్డదా అని ఎంక్వైరీ చేసుకుంటా. ఒకవేళ అది నీ మంచికే అని నా తండ్రి చెబితే దాన్ని ఫాలో అవుతాను.. మా నాన్న అంటే నాకు అంత గౌరవం'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా నబీ టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా.. వన్డే, టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు నబీ ఆఫ్గన్‌ తరపున 127 వన్డేల్లో 2817 పరుగులతో పాటు 130 వికెట్లు.. 80 టీ20ల్లో 1394 పరుగులతో పాటు 71 వికెట్లు తీశాడు. ఇక 3 టెస్టులు మాత్రమే ఆడిన నబీ 24 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో 8 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను ఇప్పటివరకు 16 మ్యాచ్‌లాడి 177 పరుగులు చేశాడు.
చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా

మరిన్ని వార్తలు