Mohammad Rizwan: కోహ్లి రికార్డు బద్దలు కొట్టి బాబర్‌ ఆజంతో సమంగా నిలిచి..

21 Sep, 2022 13:15 IST|Sakshi

పాకిస్తాన్‌ ఇన్‌ఫాం బ్యాట్స్‌మన్‌.. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ టి20ల్లో ఎదురులేకుండా దూసుకెళ్తున్నాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించిన రిజ్వాన్‌ టి20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టి20 క్రికెట్‌లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న బ్యాటర్‌గా.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో కలిసి సంయుక్తంగా తొలిస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు.

టి20ల్లో రెండువేల పరుగులు పూర్తి చేయడానికి కోహ్లికి 56 ఇన్నింగ్స్‌లు అవసరం పడితే.. రిజ్వాన్‌ మాత్రం ఈ మార్క్‌ను 52 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. కాగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు కూడా టి20ల్లో 2వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 52 ఇన్నింగ్స్‌లే అవసరం అయ్యాయి. వీరి తర్వాత కేఎల్‌ రాహుల్‌ 58 ఇన్నింగ్స్‌లు, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 62 ఇన్నింగ్స్‌ల్లో 2వేల పరుగుల మార్క్‌ను సాధించారు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు) ఆసియా కప్‌ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.కెప్టెన్‌ బాబర్‌ ఆజం 31 పరుగులు చేసి ఔటవ్వగా.. ఇఫ్తికర్‌ అహ్మద్‌ 28 పరుగులు చేశాడు. మిగతావారెవరు పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లూక్‌ వుడ్‌ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్‌ రషీద్‌ 2, సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ ఒక వికెట్‌ తీశాడు.

అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌లో అలెక్స్‌ హేల్స్‌ 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో 25 బంతుల్లో 42 పరుగులు చేసిన హారీ బ్రూక్‌ జట్టును గెలిపించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలలో ఉస్మాన్‌ ఖాదీర్‌ 2, షాహనవాజ్‌ దహనీ, హారిస్‌ రౌఫ్‌ చెరొక వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ సెప్టెంబర్‌ 22న(గురువారం) జరగనుంది.

చదవండి: Yuvraj Singh-Virat Kohli: మ్యాచ్‌కు హాజరైన యువరాజ్‌.. కోహ్లితో మాటామంతీ

ఆసియా కప్‌కు టీమిండియా మహిళల జట్టు.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే?

>
మరిన్ని వార్తలు